ఆ యువకుడికి డాన్స్ అంటే పిచ్చి. ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటాడు. అందులో భాగంగా అతి కష్టమైన కోబ్రా డాన్స్ నేర్చుకున్నాడు. ఆ కళను ప్రదర్శించి అందరి మెప్పు పొందాలనుకున్నాడు. అంతే అడవి నుంచి కొండచిలువను పట్టుకొచ్చాడు. బాత్ రూమ్ లో దాచి.. దానితో స్నేక్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇంకేముంది స్థానికులు దాన్ని చూసి హడలిపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మినగర్లోని కారుమంచి గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లోని బాత్ రూమ్ లో 11 అడుగుల కొండచిలువను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు బాత్ రూమ్ లో నక్కిన కొండచిలువను బయటకు తీసుకొచ్చారు.
దీనిపై విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు తెలిశాయి. తన ఫ్రెండ్ అయిన పెరవలికి చెందిన భగవాన్.. కొండచిలువను తీసుకొచ్చి తన ఇంట్లో దాచినట్లు చెప్పాడు. భగవాన్ ను పోలీసులు విచారించగా.. స్నేక్ డాన్స్ కోసం కొండచిలువను తీసుకొచ్చానని వివరించారు. గతంలో ఇదే పైథాన్ తో ఓ డాన్స్ షో కూడా నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు.
కొండచిలువను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఐతే ఎప్పటి నుంచి కొండచిలువను ఇంట్లో దాచాడు..? అసలది ఎక్కడ దొరికింది అనే అంశంపై ఆరాతీస్తున్నారు. మొత్తానికి కోబ్రా డాన్స్ తో షేక్ చేద్దామని భావించిన భగవాన్ కు చివరకి అదే శాపంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.