ప్రేమ, పెళ్లి ఇద్దరు యువతీ యువకులు ఇష్టపడితేనే జరుగుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా బలవంతపెట్టడం, బెదిరించడం చాలా తప్పు. అలా ఓ యువతిని ఇష్టపడ్డ యువకుడు.. సరైన దారిలో వెళ్లకుండా బెదిరింపు ధోరణితో ముందుకెళ్లాడు. అంతేకాదు హద్దులుదాటి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిపోయిన యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కన్నతల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన శ్రావణి అనే యువతి.. ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి నాగేంద్ర అనే యువకుడు పదో తరగతి తర్వాత ఖాళీగా ఉంటున్నాడు. తరచూ శ్రావణిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఆమె ఇంటి పరిసర ప్రాంతాల్లో బైక్ పై తిరుగుతూ వేధిస్తున్నాడు.
అతడి వేదింపులు ఎక్కువవడంతో కుమార్తెను రక్షించుకునేందుకు ఆమె తండ్రి శ్రావణిని ప్రకాశం జిల్లాలోని వెంపరాలలోని అత్తగారింటికి కుటుంబంతో సహా వెళ్లిపోయారు. నెల రోజుల తర్వాత కుమార్తెను అక్కడే ఉంచి తల్లిదండ్రులు మాత్రమే శానంపూడికి వచ్చారు. దీంతో నాగేంద్రబాబు.. స్థానికంగా వాలంటీర్ గా పనిచేసే తన బంధువైన అనిల్ కుమార్ ను తీసుకొని వెంపరాలలో యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ గొడవ చేశాడు. జరిగిన విషయాన్ని శ్రావణి తండ్రితో చెప్పింది. దీంతో కుమార్తెను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.
దీంతో నాగేంద్ర ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో శ్రావణి తండ్రి నాగేంద్రతో పాటు అతని తాత శ్రీనివాసరావు, వాలంటీర్ అనిల్ పై పోలీసులకు ఫిర్యాదుచేయగా.. స్పందించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. శ్రావణి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించి ధైర్యం చెప్పారు. కేసులో లోతైన విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి పేరిట ఆడపిల్లలను వేధించే నీచమైన సంస్కృతిని ఖండించాలన్నారు. అమ్మాయిలు ఆత్మహత్యలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ రక్షణ వ్యవస్థ ఉందనే సంగతి గుర్తుంచుకోవాలని., దిశ యాప్ ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.మహిళలకి ఇబ్బందులు గురి చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Harassment on women