హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కక్షగట్టిన అత్త.. పరువు కోసం దారుణం..

Anantapuram: కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కక్షగట్టిన అత్త.. పరువు కోసం దారుణం..

మురళీ, వీణ (ఫైల్)

మురళీ, వీణ (ఫైల్)

Shocking: ప్రపంచం టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా ఇంకా కులమతాలు ప్రస్తావనలు అధికమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పెద్దలు కులపట్టింపులకు పోవడం ఆక్కడితో ఆగకుండా పరువు హత్యలకు కూడా వెనుకాడటం లేదు.

GT Hemanth Kumar, News18, Tirupati

ప్రపంచం టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా ఇంకా కులమతాలు ప్రస్తావనలు అధికమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పెద్దలు కులపట్టింపులకు పోవడం ఆక్కడితో ఆగకుండా పరువు హత్యలకు కూడా వెనుకాడటం లేదు. తమకంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నారనో.. నచ్చని అమ్మాయిని పెళ్లాడాడనో పెద్దలు పిల్లల ప్రాణాల తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా తక్కువ కులానికి చెందిన యువకుడు తన కూతురిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో.. అల్లుడ్ని అత్తే హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satyasai District) కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కురుబ చిత్ర మురళి కియా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మహిళా పోలీస్ వీణతో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరైనా ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.

పెద్దలు ఒప్పుకోకపోయినా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐతే వీణ తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో తల్లి తానే అన్నీ అయి ఆమెను పెంచింది. కానీ కూతురు తన మాట వినకుండా వేరే కులం యువకుడ్ని పెళ్లి చేసుకోవడంతో ఆమె కోపంతో ఊగిపోయేది. మరోవైపు పెళ్లైన తర్వాత మురళీ, వీణ.. రాప్తాడు ఎస్సీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని కొత్తకాపురం మొదలుపెట్టారు. ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్నారు.

ఇది చదవండి: నీ భార్యతో ఉన్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసిన ప్రియుడు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్..


ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం 3గంటలకు డ్యూటీకి వెళ్లిన మురళీ రాప్తాడు జంక్షన్ వద్ద పెట్రోల్ బంకులో బైక్ పెట్టి.. కియా కంపెనీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే సమయంలో కారులో అక్కడికి వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. అతడ్ని బలంవంతంగా తీసుకెళ్లి లింగనపల్లి శివారులోని పొలాల్లో గొంతుకోసి హత్య చేశారు. డ్యూటీకి వెళ్లిన తన భర్త శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి రావాల్సి ఉంది. మురళి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్ చేసింది. అతడి ఫోన్ పనిచేయకపోవడంతో కంగారుగా పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లింది. అక్కడ బైక్ ఉన్నా.. తన భర్త ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్పందించిన పోలీసులు, రాప్తాడు వైజంక్షన్‌ సమీపంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. వాహనంలో కొందరు వ్యక్తులు మురళిని బల వంతంగా ఎక్కించుకొని వెళ్లడాన్ని గుర్తించారు. కారు వెళ్లిన శివారు ప్రాంతాల్లో గాలించగా మురళీ మృతదేహం లభ్యమైంది. తన భర్తను తన తల్లే చంపించిందని హతుడి భార్య వీణ ఆరోపించింది. తాను కులాంతర వివాహం చేసుకోవడం మా అమ్మకు ఇష్టం లేదని తెలిపింది. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తను వదిలిపెట్టి ఇంటికి రమ్మని బలవంతం చేసిందని పేర్కొంది. ఇంటికి రాకపోతే మురళిని చంపేస్తానని బెదిరించిందని వెల్లడించింది. మా అమ్మే ఇంత దారుణం చేయించింది అని వీణ కన్నీటి పర్యంతమైంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Honor Killing

ఉత్తమ కథలు