Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. గుంటూరు జిల్లా (Guntur District) పల్నాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఫ్యాక్షన్ రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. టీడీపీ నేత హత్య, ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జ్ పై వైసీపీ దాడి వంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. జరిగిన వివాదాన్ని టీడీపీ.. అధికార పార్టీపై నెడుతుండగా.. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్ష పార్టీ నేతలే ఇలా చేస్తున్నారని వైసీపీ అరోపిస్తోంది. పల్నాడులో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంటే టీడీపీ, వైసీపీల మధ్య వార్ 2019 ఎన్నికల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన కొద్దిరోజులకే వైసీపీ వర్గీయులు.., బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేశారనేది టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రయ్య హత్య తర్వాత పల్నాడు ప్రాంతం అట్టుడికింది. ఏకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు.
ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజే నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వై.ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం మాయమైందంటూ స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీనివాసరెడ్డి జొన్నలగడ్డలో రోడ్డుపై భైటాయించి ధర్నా చేయడం ఆ వెనువెంటనే పోలీసులు ఇద్దరు టీడీపీకి చెందిన యువకులను అదుపులోకీ తీసుకోవడం చర్చాంశనీయమైంది. ఐతే దీనికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వై.ఎస్.ఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలే దాచేసి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, చంద్రయ్య హత్య విషయాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ఇటు వంటి చవకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. పోలీసులు అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను విడుదల చేయాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు శనివారం రోడ్డుపై భైటాయించారు. వారికి సర్దిచెప్పవలసిన పోలీసులు అరవిందబాబుపై దాడిచేయడంతో ఆయన ధర్నా ప్రదేశంలోనే స్పృహతప్పి పడిపోయారు.
ఐతే స్పృహకోల్పోయిన అరవిందబాబుని నరసరావుపేట లోని ఓ వైద్యశాలకు తరలించే తరుణంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు ఆయన్ను తరలిస్తున్న అంబులెన్స్ పై దాడికి పాల్పడి అంబులెన్స్ ను ధ్వంసం చేశారు.అక్కడే ఉండి కూడా అంబులెన్స్ పై దాడిచేస్తున్న కనీసం అడ్డుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్ర అస్వస్థతకు లోనైన చదలవాడ అరవింద బాబు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. అరవిందబాబు ఆరోగ్య పరిస్థితి పై మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమంటున్నారు డాక్టర్లు.
ఈ వ్యవహారంతో వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నరసరావుపేట చేసుకొని అరవింద్ బాబుకు మద్దతిస్తుండగా.. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడి అరవింద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వచ్చేఎన్నికల్లో పల్నాడులో పాగా వేసేందుకు ఇది గొప్ప అవకాశంగా మారుతుందని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, TDP, Ysrcp