వైసీపీ అధికారంలోకి రాగానే... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరతారనే ప్రచారం రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కీలకమైన జల వనరుల శాఖను ఎవరికి కేటాయించాలనే అంశంపై వైసీపీ లోతుగా సమాలోచనలు చేస్తోంది. ఐతే... ఈ సందర్భంగా పార్టీలో... ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు సహా అన్ని అంశాలపైనా ఉండవల్లికి అవగాహన ఉంది. దానికి తోడు ఆయన రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ కావడం, అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తుండటంతో... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఉండవల్లి ప్రభుత్వ సలహాదారుగా పనిచేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. ఇందుకు ఆయన ఒప్పుకుంటే, ఇక పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి టెన్షన్లూ లేకుండా ఉండొచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు 70.17 శాతం పూర్తయింది. టీడీపీ హయాంలో ఈ పనులు కొంతవరకూ సాగినా... ప్రాజెక్టు పూర్తికాలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఎక్కువగా ఉంది. అందువల్ల జగన్ సీఎం కాగానే ముందు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా జరగాలంటే... కేంద్రం వెంటనే పోలవరానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాల్సి ఉంది. కేంద్రం మాత్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్ (UC) ఇస్తేనే నిధులు ఇస్తామని అంటోంది. అందువల్ల ముందు జగన్... ఈ ప్రాజెక్టుకు సంబంధించి UC ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వెంటనే జరగాలంటే నీటి పారుదల శాఖలో సమర్థుడైన మంత్రి ఉండాలి. ఇందుకోసం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ నేతకు ఈ శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు ప్రచారంలో ఉంది.
పోలవరానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం డిసెంబర్ నాటికి గ్రావిటీపై నీరిస్తామని చెప్పింది. వాస్తవంగా ఆ పరిస్థితి లేదు. నీరు ఎడమ కాలువలోకి రావాలంటే అవసరమైన సొరంగ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వేరే మార్గం ద్వారా గ్రావిటీపై నీరిచ్చే అవకాశం ఉన్నా ఎడమ కాలువ పనులు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తవుతున్నాయి కాబట్టి ముంపు గ్రామాల పునరావాసంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.