ఫలితాల కోసం వైసీపీ సన్నద్ధం... టీడీపీ తీరుపై ఆందోళన...

AP Assembly Election Result : ఎన్నికల ఫలితాలకు మరో 6 రోజులే టైం ఉండటంతో ప్రతిపక్ష వైసీపీలో ఓవైపు ఆనందం మరోవైపు టెన్షన్ కనిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 5:49 AM IST
ఫలితాల కోసం వైసీపీ సన్నద్ధం... టీడీపీ తీరుపై ఆందోళన...
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులను పదే పదే తలచుకుంటూ భయపడుతోంది వైసీపీ. ఇందుకు ప్రధాన కారణం... ఎన్నికల ఫలితాలు ప్రకటించే మే 23న టీడీపీ ఆందోళనలు, అల్లర్లకు దిగుతుందేమోనన్న టెన్షనే. ఎక్కువ సర్వేల్లో ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతుండటం, స్వయంగా చంద్రబాబే... ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పడంతో... అధికార పార్టీ ఓడిపోతామన్న ఆలోచనతో ఉందనీ, కాబట్టి ఎన్నికల ఫలితాల రోజున ఏదో ఒక గందరగోళం చేసి... తమకు అధికారం దక్కకుండా చేసేందుకు కుట్రలు పన్నే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పోలింగ్ రోజున ఎలాంటి అల్లర్లూ జరగకుండా ఏం చెయ్యాలన్న దానిపై ఏజెంట్లు, నేతలు, పార్టీ ముఖ్యులకూ ట్రైనింగ్ ఇస్తున్నారు.

కౌంటింగ్ తీరు, లెక్కింపు విధానం, ఏదైనా డౌట్ వస్తే ఏం చెయ్యాలి అనే అంశాలపై వైసీపీ ఇప్పటికే వన్ డే మొత్తం ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2014లో ఇలాంటివేవీ చెయ్యని ఆ పార్టీ... ఈ ఐదేళ్లలో టీడీపీని చూసి చాలా నేర్చుకుంది. ప్రత్యర్థిని బలంగా ఎదుర్కోవాలంటే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకుంది. దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు సాదాసీదా నేత కాదు. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. అలాంటి ఆయన్ని చూస్తూ... ఆయన వేసే ఎత్తుగడలను ఎదుర్కొంటూ వైసీపీ... బాగా రాటుదేలిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ - వైసీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువే. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా... టీడీపీ 102 సీట్లు గెలిచింది. ఆ పార్టీకి 46.30 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ 67 సీట్లు సాధించగా ఆ పార్టీకి 44.47 శాతం ఓట్లు లభించాయి. అంటే 1.83 శాతం ఓట్ల తేడాతో.. 35 సీట్లు తారుమారయ్యాయి. ఈసారి అలా జరగకూడదని భావిస్తున్న వైసీపీ... మరింత గట్టిగా ప్రయత్నించింది. ఐతే... చంద్రబాబు తీరుపై ఆ పార్టీ లోలోపల ఆందోళన చెందుతోంది.

ఎన్నికలు జరిగిన తర్వాతి రోజు నుంచే చంద్రబాబు ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల స్లిప్పులపై ఆందోళనకు దిగారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ ఆయా పార్టీలతో ఈ విషయంపై మంతనాలు జరిపారు. ఇప్పటికీ 50 శాతం వీవీప్యాట్లలో స్లిప్పులు లెక్కపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఏదో ఒకటి చేసి మళ్లీ అధికారంలోకి రావాలనో, లేదంటే, తాము అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అందుకే ఆ పార్టీ ఇప్పుడు అత్యంత అలర్ట్‌తో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కౌంటింగ్ ఆగకుండా, ఏ ఓటూ గల్లంతు కాకుండా చెయ్యాలని జగన్ గట్టిగా చెబుతున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు దిగేందుకు ప్రయత్నిస్తే, వెంటనే వాళ్లను లెక్కింపు కేంద్రం నుంచీ వీలైనంత దూరంగా తీసుకెళ్లిపోవాలని, ఇందుకు పోలీసుల సాయం తీసుకోవాలని ఏజెంట్లు, పార్టీ ముఖ్యలకు చెబుతున్నట్లు తెలిసింది.
Published by: Krishna Kumar N
First published: May 17, 2019, 5:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading