YCP CHIEF YS JAGAN TO CHOOSE EAST GODAVARI DISTRICT SENIOR POLITICIAN FOR ASSEMBLY AFFAIRS MINISTER NK
కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?
జగన్ మోహన్ రెడ్డి (File)
AP Assembly Election 2019 : తాము అధికారంలోకి వస్తే, ప్రతిపక్షంలోని చంద్రబాబును ఎదుర్కోవడానికి సరైన నేత అసెంబ్లీలో ఉండాలని భావిస్తున్న జగన్... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆ నేతను అసెంబ్లీలోకి తేబోతున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అయిపోయి అప్పుడే 25 రోజులైపోయాయి. మరో మూడు వారాల్లో అంటే మే 23న ఫలితాలు వచ్చేస్తాయి. వాటి ప్రకారం కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామనీ, తమకు మినిమం 100 సీట్లు... మాగ్జిమం 130 సీట్లు వస్తాయని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్... వెంటనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కి... పాలన సాగించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన... తన కేబినెట్‌లో ఎవరెవరు మంత్రులుగా ఉండాలనే అంశంపై లోటస్ పాండ్‌లో లోతుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యేంటంటే... వైసీపీలో సీనియర్ నేతల కొరత ఉంది. వాళ్లలోనూ ఇదివరకు మంత్రులుగా చేసినవాళ్లు కొద్ది మందే.... అంటే... విజయనగరంలో బొత్స సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు తదితరులు మాత్రమే అనుభవంతో జగన్ పక్షాన అండగా నిలుస్తున్నారు. ఐతే... వీళ్లెవరూ జగన్ కోరుకుంటున్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను బలంగా నిర్వహిస్తారన్న ఆలోచనలో జగన్ లేనట్లు తెలుస్తోంది.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో... కొణిజేటి రోశయ్యను అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. మాటకారి, చతురుడైన ఆయన... తనకున్న రాజకీయ అనుభవంతో అప్పటి ప్రతిపక్షమైన టీడీపీకి గట్టిగానే సమాధానం ఇచ్చేవారు. ఎంతో అనుభవ ఉన్న చంద్రబాబు సైతం రోశయ్య మాటకారితనం ముందు తేలిపోయేవారు. నొప్పించక, తానొవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తూ రోశయ్య అసెంబ్లీ వ్యవహారాల్ని జాగ్రత్తగా కొనసాగించారు.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే... 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ఎదుర్కోవడం తమకు సవాలేనని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంచనా ప్రకారం... వైసీపీకి మాగ్జిమం 130 సీట్లు వస్తే... ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి దాదాపు 60 నుంచీ 70 సీట్లు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతమంది ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే... వాళ్లందర్నీ కట్టడి చెయ్యాలంటే... సరైన మాటకారి నేత అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉండాలని జగన్ అనుకుంటున్నారని తెలిసింది.
ఉండవల్లి అరుణ్ కుమార్
తూర్పుగోదావరి జిల్లా... రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... వైఎస్ రాజశేఖర రెడ్డికి విశ్వాసపాత్రుడు. స్వతహాగా లాయరైన ఆయన... మాటల మాంత్రికుడు కూడా. ఏ విషయాన్నైనా చతురత ప్రదర్శిస్తూ... అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఉండవల్లికి తిరుగులేదు. అందుకే జగన్ ఆయనను అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా నియమించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఐతే... వైఎస్ దివంగతులయ్యాక... ఉండవల్లి జగన్‌కి దూరంగా ఉంటున్నారు. అలాగని జగన్‌తో ఆయనకు విబేధాలేవీ లేవు. జగన్‌పై కేసులు న్యాయస్థానాల్లో చెల్లవు అని తరచూ అంటున్నారు. వైసీపీలో చేరనప్పటికీ ఉండవల్లి ఆ పార్టీ నేతలతో టచ్‌లోనే ఉంటున్నారు. తరచూ చంద్రబాబుపై విమర్శలు కూడా చేస్తున్నారు. అందువల్ల జగన్ కోరుకుంటే ఆయన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి అయ్యే ఛాన్సుంది.
ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో ఖాళీలు లేవు. ఈమధ్యే కొన్ని ఖాళీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఎన్నికలు వచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. రెండు సభల్లో సభ్యుడు కాకుండా 6 నెలలు పాటూ ఉండవల్లి మంత్రిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఎమ్మెల్సీని రాజీనామా చేయించి, ఆయన స్థానంలో ఉండవల్లిని తెచ్చే అవకాశాలున్నాయి. ఈ దిశగా జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగి... వైసీపీ అధికారంలోకి వస్తే, ఉండవల్లి అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉంటే... ఇక తమకు టీడీపీ నుంచీ ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని జగన్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.