ఏ పార్టీ అధికారంలో ఉన్నా వ్యవస్థను గౌరవించాలి. బాధ్యతాయుత వృత్తిలో ఉన్నవారిని మర్యాద ఇవ్వాలి. అలా జరగకుంటే మాత్రం అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా సరే వ్యతిరేకతను ఎదుర్కొవాల్సిందే. ముఖ్యంగా పోలీసుల విషయంలో విమర్శలు చేసేటప్పుడు వెనుక ముందు ఆలోచించాలి. లేదంటే ఎదురుదెబ్బలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కలకలం రేగింది. స్థానిక వైసీపీ నేత కర్రి పాపారాయుడు ప్రసంగిస్తూ..టీడీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ కుక్కల్లా పనిచేసిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమపై ఇష్టానుసారంగా రౌడీ షీట్లు తెరిచారన్నారు. అలాగే కాపు ఉద్యమ సమయంలో తమ ఆడవాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా లేనిపోని కేసులతో వేధించారన్నారు.
ఐతే అదే వేదికపై ఉన్నఎమ్మెల్యే జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆయన్ని వారించే ప్రయత్నం చేసినా పాపారాయుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఐతే పాపరాయుడు కామెంట్స్ చిర్రెత్తుకొచ్చిన మండపేట ఎస్సై మంగాదేవి మాత్రం స్టేజ్ పైనే ఆయనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు.
తాము యూనిఫామ్ వేసుకున్నప్పుడు ప్రభుత్వాదేశలకు అనుగుణంగా పనిచేస్తామే తప్ప.. ఎవరిష్టానుసారం వారు పనిచేయమన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నిబంధనల ప్రకారమే చేస్తామని.. ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరిపైనా రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నారు. అప్పట్లో ఉన్న వ్యక్తులైతే చేశారేమో గానీ మేం అలా చేయమని.. అలా అంటే పడటానికి ఇక్కడ లేమని స్పష్టం చేశారు. దీంతో మధ్యలో కల్పించుకున్న తోట త్రిమూర్తులు ఎస్సైకి నచ్చజెప్పారు. అనవసర విషయాలు మాట్లాడొద్దని స్థానిక నేతలను వారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, East Godavari Dist, Ysrcp