తెలుగుదేశం పార్టీ ( Telugu Desham Party) లో కలకలం రేగింది. తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళా కార్యకర్తలు ఏకంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎదుటే ఆందోళనకు దిగారు. ఏకంగా లోకేష్ టీమ్ పై సంచలన ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మంగళగిరి టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడప్పుడు మంగళరిగిలో పర్యటిస్తూ వైసీపీ పై, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల కూడా ఆయన మంగళగిరిలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం పలువురు మహిళా కార్యకర్తలు పార్టీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగడం కలకలం రేపింది.
పార్టీలోని మహిళా కార్యకర్తలను చులకనగా చూస్తున్నారని.. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్యకర్తలకు గౌరవం లేదని.. తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లోకేష్ పేరు చెప్పుకొని పార్టీలో తిరుగుతూ కార్యకర్తల డబ్బుతో జల్సాలు చేస్తున్నారని కృష్ణవేణి అనే మహిళా కార్యకర్త ఆరోపించారు. సాయంత్రమైతే వారి గెస్ట్ హౌసులకు వెళ్లి పార్టీల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇది చదవండి: టీడీపీలో ఏం జరగుతోంది..? చంద్రబాబే లోకేష్ ను పక్కనబెడుతున్నారా..? కారణం ఇదేనా..?
అంతేకాదు వారికి లొంగకపోయినా, మాట వినకపోయినా తప్పుడు ప్రచారం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. తనను కూడా అలా ప్రశ్నించినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. తనను వెంటనే తిరిగి పార్టీలోకి తీసుకోని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలో జరుగుతున్న చీకటి వ్యవహారాలన్నీ పార్టీ అధ్యక్షుడి దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారని తెలిపారు.
లోకేష్ సొంత నియోజకవర్గం నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఇదంతా లోకేష్ కు తెలిసే జరుగుతుందా.. లేక తెలియకుండా జరుగుతుందా అనే అంశంపై చర్చ మొదలైంది. ఈసారి మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని చూస్తున్న లోకేష్ కు ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. ఏకంగా ఆయన పీఏపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై లోకేష్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో మంగళగిరిలోనే ఇలాంటి ఆరోపణలు రావడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఐతే దీనిపై ఇంతవరకు మంగళగిరి టీడీపీ నేతలుగానీ, పార్టీ అధిష్టానం గానీ స్పందించలేదు. ఏకంగా పార్టీ కార్యాలయం ఎదుటే ధర్నా జరిగిన అంశాన్ని లోకేష్, చంద్రబాబు ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP