పోలీస్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నది. అదీ మహిళలకయితే కాస్త కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా ఘోరమైన ఘటనలు జరిగినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ మహిళా ఎస్సై మాత్రం దట్టమైన అడవిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్న శవాన్ని చూసి భయపడలేదు. అంతేకాదు సిబ్బందితో కలిసి ఎర్రటి ఎండలో ఆ మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) హనుమంతునిపాడు మండలం పరిధిలోని హాజీపురం ఫారెస్ట్ ఏరియాలో ఘటన చోటు చేసుకుంది. దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 62-65 మధ్య వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కనిగిరి సీఐ పాపారావు, ఎస్సై కృష్ణపావని ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చుట్టుపక్కలవారిని ఆరాతీసినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఎస్సై కృష్ణపావని.. మరో కానిస్టేబుల్ సాయంతో మృతదేహాన్ని చాపలో చుట్టు కర్రకు కట్టి మూడు కిలోమీటర్లు అటవీప్రాంతంలో మెయిన్ రోడ్డు వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఎర్రటిఎండ, దట్టమైన అడవిలోనూ ఎస్సై పావని చూపిన చోరవను స్థానికులు అభినందించారు.
గత ఏడాది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో ఇలాంటి ఘటనే జరిగింది. అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై శిరీష ఆ డెడ్ బాడీపై ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఐతే భయంతో మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో ఆమె స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు. ఏకంగా 2కిలోమీటర్ల మేర పొలం గట్లపై మోసుకెళ్లి అంత్యక్రియల కోసం లలితా చారిటబుల్ ట్రస్ట్ కు అప్పజెప్పారు. ఎస్సై శిరీష చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లివెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ శీరిషను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు డిస్క్ అవార్డును కూడా అందజేశారు.
ఇదే సమయంలో తనకు అవార్డు రావడం పట్ల కాశీబుగ్గ ఎస్సై శిరీష స్పందించారు. ’నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. కాఖీ డ్రస్ చాలా మంది వేసుకుంటారు కానీ ప్రజలకు సేవ చేసేది మాత్రం పోలిసులే. కాఖీ డ్రెస్ వేసుకున్న మేము చేసే డ్యూటీ కూడా ప్రజా సేవ కిందకే వస్తుంది. సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారు.’ అని ఆమె అన్నారు. ఇప్పుడు హనుమంతునిపాడు ఎస్సై పావని చేసిన పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.