వ్యభిచార కూపం నుంచి తల్లిదండ్రుల చెంతకు.. 12 ఏళ్ల తర్వాత..

చివరికి లత ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తిరిగి లక్ష్మీనారాయణను ఆచూకీ తెలుసుకుని సంప్రదించడంతో లత తిరిగి పన్నెండేళ్ల విరామం తర్వాత తన తల్లితండ్రుల చెంతకు చేరింది.

news18-telugu
Updated: December 10, 2019, 8:46 PM IST
వ్యభిచార కూపం నుంచి తల్లిదండ్రుల చెంతకు.. 12 ఏళ్ల తర్వాత..
తల్లిదండ్రుల చెంతకు చేరి లత
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)
పన్నెండేళ్ల క్రితం ఇంట్లో మందలించారనే కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన విజయవాడ బాలిక అనుకోని పరిస్దితుల్లో తమిళనాడులో వ్యభిచార కూపంలో చిక్కుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆమె.. పెంపుడు తల్లి చనిపోవడం, భర్త తరపు బంధువుల ఆదరణ కూడా కరువవడంతో తిరిగి బెజవాడకు చేరుకుంది. వారం వారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తన తల్లితండ్రులను వెతికి పెట్టాలన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు ...24 గంటల్లోనే ఆమెను తల్లితండ్రుల చెంతకు చేర్చారు.

ఓ మహిళ నన్ను 500లకు మధురిక అనే మహిళకు అమ్మేసింది. ఆమె చెన్నై తీసుకెళ్లి పెంచి పెళ్లి చేసింది. ఆమె చనిపోయాక నా కన్నవారిని కలవాలనిపించింది. అందుకు నా భర్త కూడా అంగీకరించి విజయవాడ తీసుకువచ్చారు. రామకృష్ణ అనే న్యాయవాది సహాయంతో స్పందనలో ఫిర్యాదు చేశాం. ఇప్పుడు నా తల్లిదండ్రులను కలవడం సంతోషంగా ఉంది.
ఆదిలక్ష్మి (లత)


నా కుమార్తె ఆదిలక్ష్మి గుడ్లవల్లేరులో 2007లో తప్పిపోయింది. పాపను వెతికడం కోసం హోంగార్డు ఉద్యోగం కూడా వదిలేశాను. తిరుపతి, ఇతర ప్రాంతాలలో తిరిగినా పాప దొరకలేదు. ఇప్పుడు స్పందన కార్యక్రమం ద్వారా నా కూతురు మా వద్దకు చేరడం సంతోషంగా ఉంది.
లక్ష్మీ నారాయణ తండ్రి


అసలేం జరిగిదంటే..?
2007లో ఇంట్లో తల్లితండ్రులు మందలించారనే కోపంతో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు పట్టణం నుంచి ఇల్లు వదిలి పారిపోయిన ఆదిలక్ష్మి అనే ఎనిమిదేళ్ల బాలిక విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కు చేరుకుంది. అక్కడ ఓ దళారీ ఆమెను 500 రూపాయల కోసం తమిళనాడుకు చెందిన వ్యభిచార ముఠాకు అమ్మేసింది. అలా తమిళనాడుకు చేరుకున్న ఆదిలక్ష్మి ఎలాగోలా తప్పించుకుని ఓ చోట ఆశ్రయం పొందింది. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన మహిళ లతగా పేరు మార్చి పెంచి పెద్ద చేసింది. కొన్నేళ్ల క్రితం పెళ్లి కూడా చేసింది. ఆ తర్వాత పెంపుడు తల్లి చనిపోవడం, భర్తకు కూడా అనారోగ్యంతో ఉన్న తల్లి తప్ప ఇతర బంధువులెవరూ లేకపోవడంతో లతకు తిరిగి తన తల్లితండ్రులపై దృష్టి మళ్లింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వదిలేసిన తల్లిదండ్రులను వెతుక్కుంటూ విజయవాడ వచ్చిన లత నిన్న స్పందన కార్యక్రమంలో విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.

లత ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో లతను తల్లితండ్రుల వద్దకు చేర్చేందుకు మీడియాతో పాటు సాధారణ ప్రజల సాయం కూడా కోరారు. దర్యాప్తులో భాగంగా పాత కేసులను వెతుకుతున్న విజయవాడ పోలీసులకు 2007లో ఆమె తండ్రి ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు కనిపించింది. అప్పట్లో హోంగార్డుగా పనిచేస్తున్న తండ్రి లక్ష్మీనారాయణ కూతురు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు శాఖ స్పందించకపోవడంతో మనస్తాపం చెంది ఉద్యోగాన్ని వదిలి పెట్టాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ గా పని మొదలుపెట్టాడు. ఎంత వెతికినా కూతురు ఆచూకీ లభించకపోవడంతో ఆ విషయాన్ని ఆదిలక్ష్మి కుటుంబం మెల్లగా మర్చిపోయింది. చివరికి లత ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తిరిగి లక్ష్మీనారాయణను ఆచూకీ తెలుసుకుని సంప్రదించడంతో లత తిరిగి పన్నెండేళ్ల విరామం తర్వాత తన తల్లితండ్రుల చెంతకు చేరింది. రేషన్ కార్డుతో పాటు ఇతర వివరాలు పోల్చి చూసుకున్న విజయవాడ పోలీసులు లతను తల్లితండ్రులకు అప్పగించారు.
Published by: Shiva Kumar Addula
First published: December 10, 2019, 8:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading