ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మూడు కాళ్ల విత శిశువుకు జన్మనిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. ఐతే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. బాబుకు మూడుకాళ్లు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జన్యుపరమైన లోపాలతో ఇలాంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు.
అలాగే శిశువు తల్లిదండ్రులది మేనరిక వివాహమని.. అది కూడా ఈ లోపానికి కారణమై ఉండొచ్చని చెప్పారు. వెంకటేశ్వరమ్మ, రామ్మోహనరావు దంపతులకు ఇంతకుముందే ఓ ఆడపిల్ల జన్మించింది. తాజాగా జన్మించిన శిశువుకు మూడో కాలు వీపుభాగం నుంచి బయటకు పొచుచుకువచ్చినట్లుగా ఉంది. మరోవైపు శిశువుకు వచ్చిన అదనపు కాలును తొలగించాలని తల్లిదండ్రులు డాక్టర్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. మూడో కాలు వెన్నుముకకు దగ్గర్లోనే ఉండటం ఆపరేషన్ చేసి తీసేయడం సాధ్యం కాకపోవచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే శిశువు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.
కృష్ణాజిల్లాలో మూడు కాళ్ల వింత శిశువు జననం
తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగానే చోటు చేసుకుంటున్నాయి. 2017లో జనగామకు చెందిన ఓ దంపతులకు మూడు కాళ్లతో కూడిన బాబు జన్మించాడు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. ఇలాంటి జన్యులోపాలతో పుట్టిన పిల్లలకు ఆపరేషన్లు చేసి అదనపు అవయవాలను తొలగించడం చాలా కష్టం. హైదరాబాద్ కు అవిభక్త కవలలు చెందిన వీణ-వాణిని విడదీసే ప్రక్రియ ఏళ్లుగా సాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు కూడా వీరి విషయంలో చేతులెత్తేశారు.