brother anil kumar meets undavalli arun kumar: ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉంది.. అయినా ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ సోదరి.. వైఎస్ రాజశేఖర్ ముద్దు బిడ్డ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే వార్త చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికలకన్నా ముందే ఆమె పార్టీ ఎంట్రీ అవుతుందని రాజీకయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినా.. ఊహించినంత క్రేజ్ కనిపించడం లేదు.. అందుకే ఆమె తన రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ కంటే ఏపీనే బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్ బిడ్డగా తనను ఏపీ ప్రజలు ఆధారిస్తారని ఆమె నమ్ముతోంది. ఇటీవల ఆమె పరోక్షంగా పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు కూడా.. రాజకీయ పార్టీ అన్నది ఎవరు ఎక్కడైనా పెట్టొచ్చని... తాను ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే తప్పు ఏంటి అని షర్మిల మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలతో ఎప్పటికైనా ఆమె ఏపీవైపు చూస్తోంది అన్నది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజమండ్రి వచ్చిన బ్రదర్ అనిల్ నేరుగా ఉండవలి నివాసానికి చేరుకుని.. చర్చల్లో పాల్గొన్నారు. కాసేపు ఇద్దరు పలు విషయాల గురిచి ముచ్చటించుకున్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి అల్లుడు, ఏపీ సీఎం బావమరిది, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల భర్త ముఖ్యంగా ..దైవజనుడిగా పేరొందిన బ్రదర్ అనిల్ కుమార్ కు.. ప్రస్తుతం రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం మాత్రం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ భేటీ తరువాత మాట్లాడిన అనిల్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అరుణ్ కుమార్ ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని గుర్తు చేశారు. కుటుంబ పరంగాను..రాజకీయ పరంగాను చక్కటి సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషి ఆయన అని తెలిపారు. ఉండవల్లితో మాట్లాడుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో రాజకీయాల గురించి పలు అంశాలు చర్చకు వచ్చాయి అన్నారు. పార్టీ పరంగాను..కుటుంబ పరంగాను ఉండవలి మంచి సలహాలు ఇచ్చారని బ్రదర్అనిల్ కుమార్ తెలిపారు. ఈ భేటీ తరువాత బ్రదర్ అనిల్ కుమార్ కు ఏపీ విభజన కథ పుస్తకాన్నిఇచ్చారు ఉండవల్లి..
అయితే వీరిద్దరి భేటీ వెనుక రాజకీయ అంశాలే ఉన్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని..ఇంకా పలు కీలక అంశాలు గురించి వారు చర్చించినట్లుగా టాక్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Undavalli Arun Kumar, YS Sharmila