Home /News /andhra-pradesh /

WILL JOIN OFFICE SOON SAYS NIMMAGADDA RAMESH KUMAR AK

విధుల్లో చేరతా.. హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందన

నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు

నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు

Nimmagadda ramesh kumar: హైకోర్టు సూచనలతో విధుల్లో చేరతానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు.

    ఏపీ ఎస్ఈసీగా తనను తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. హైకోర్టు సూచనలతో విధుల్లో చేరతానని ప్రకటించారు. నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగం శాశ్వతమని ఆయన వెల్లడించారు. ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన్ను తొలగిస్తూ తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది.

    ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇంతకుముందు తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఎందుకు ఆయన్ను తొలగించారని ప్రశ్నించగా రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

    అయితే, గవర్నర్ తెచ్చిన ఆర్డినెన్స్‌ ఇప్పుడు పనిచేయదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను విధుల్లోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నట్టేనని వివరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు