ఢిల్లీలో వియ్యం..ఏపీలో కయ్యం...టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదన్న కాంగ్రెస్

ప్రతీకాత్మక చిత్రం

టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోవడంతో..ఏపీలో నాలుగు స్తంభాలాట జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోబోమని ప్రత్యర్థి నేతలకు హెచ్చరికలు కూడా పంపారు. అటు వైసీపీ అధినేత జగన్ సైతం ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నారు.

 • Share this:
  ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ తరహాలోనే ఇరుపార్టీలు సీట్లు పంచుకుంటాయని ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో సింగిల్‌గానే పోటీచేస్తామని తెగేసి చెప్పారు.

  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యలో ఏపీలో పొత్తులపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తాం. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 31న కాంగ్రెస్ నేతలమంతా భేటీ అవుతాం. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కమిటీ ఏర్పాటుపై పార్టీ అధిష్టానికి ఈనెలలోనే నివేదిక పంపుతాం. రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు.
  ఊమెన్ చాందీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి

  ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టని బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంతో దేశంలో మరోసారి ఇందిరాగాంధీ పవనాలు వీస్తాయన్నారు రఘువీరా. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ విభజన హామీలు నెరవేరతాయని స్పష్టంచేశారు.

  టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోవడంతో..ఏపీలో నాలుగు స్తంభాలాట జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని..మొత్తం 175 స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని గతంలోనే పలుమార్లు చెప్పారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోబోమని ప్రత్యర్థి నేతలకు హెచ్చరికలు కూడా పంపారు. అటు వైసీపీ అధినేత జగన్ సైతం ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో చతుర్ముఖ పోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  First published: