Antarvedi: అంతర్వేది రథంపై ఏపీ దేవాదాయశాఖ కీలక ప్రకటన

అంతర్వేది రథం(credit - twitter)

కొత్త రథం నిర్మాణంతో పాటు రథశాల మరమ్మత్తుల కోసం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.

  • Share this:
    అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధంపై ఏపీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడంతో విపక్షాలు, హిందూ సంఘాలు కొంత మేర శాంతించాయి. ఈ క్రమంలో కొత్త రథం నిర్మాణంపై ఏపీ దేవాదాయశాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. అప్పటిలోగా అంద‌రి అభిప్రాయాల మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా.. రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు వెల్లడించారు..

    సొమ‌వారం దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌తో మంత్రి వెలంప‌ల్లి స‌మావేశం అయ్యారు. అంతర్వేది కొత్త రథం నిర్మాణంపై చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందని చెప్పారు. రథం నిర్మాణంపై అన్ని వర్గాలతో చర్చించి ఆకృతిని తయారు చేయించామని చెప్పారు. శిఖరంతో కలిపి కొత్త రథాన్ని41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించినట్లు వెల్లడించారు. ఆరు చక్రాలతో కూడిన ఈ రథాన్ని మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా నిర్మిస్తున్నట్లు చెప్పారు మంత్రి వెల్లంపల్లి. కొత్త రథం నిర్మాణంతో పాటు రథశాల మరమ్మత్తుల కోసం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.


    కాగా, సెప్టెంబరు 5న సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు భగ్గుమన్నారు. రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేదంటే కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. అంతేకాదు చలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: