ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం అన్ని వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలను (AP Welfare Schemes) అందిస్తోంది. పెన్షన్లు, రైతు భరోసా (Rythu Bharosa), చేయూత, ఆసరా, కాపునేస్తం (YSR Kapu Nestham) పథకాల పేరుతో ఆర్ధిక సాయం అందిస్తోంది. ఐతే ఈ పథకాలకు అర్హత సాధించేందుకు పలువురు అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు గతంలో వెలుగుచూశాయి. ముఖ్యంగా పెన్షన్ల కోసం ఆధార్ కార్డుల్లో వయసు మార్పించుకోవడం, చిన్నచిన్న లోపాలకు వైకల్యముందంటూ ధృవపత్రాలు తెచ్చుకొని పెన్షన్ పొందడం, ఆదాయం తక్కువగా రాయించి రేషన్ కార్డులు పొందటం వంటివి చేస్తుంటారు. ఐతే ఓ మహిళ అందరికంటే ఓ అడుగు ముందుకేసింది. వితంతు పెన్షన్ కోసం ఎకంగా భర్తనే చంపేసింది. కట్టుకున్నవాడ్ని మర్డర్ చేయలేదుగానీ.. చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఎంచక్కా పెన్షన్ తీసుకుంటోంది. సదరు మహిళ వాలంటీర్ గా పనిచేస్తూ ఈ స్కెచ్ వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వైయస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాదిన్నర కుమారుడున్నాడు. ఐతే భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య వాలంటీర్ గా పనిచేస్తోంది. ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్లు పంచడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమోదు చేస్తుండటంతో పథకాలు ఎంలా పొందాలి, ఎలా సర్టిఫికెట్లు మార్చాలి, అర్హతలను ఎలా చూపించాలనేదానిపై పట్టుసాధించింది. భర్తకు దూరంగా ఉంటున్న తనకు వితంతు పెన్షని రాయించుకోవాలన్న ఐడియా వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి బ్రతికున్న భర్త చనిపోయాడంటూ వీఆర్వో సాయంతో సర్టిఫికెట్ సృష్టిచింది. వెంటనే సచివాలయంలో నమోదు చేయించుకోని వితంతు పింఛన్ కార్డు పొందింది చక్కగా పెన్షన్ తీసుకుటోంది.
ఐతే భర్త సుభాహాన్ కు విషయం తెలియక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిసి దరఖాస్తు చేయాలనుకున్నాడు. ఐతే రేషన్ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. ఐతే తన పేరును ఎలా తొలగిస్తారని ఆరా తీయగా.., అతడు మరణించినట్లు నమోదైందని సిబ్బంది వివరించారు. వెంటనే కార్డు తీసుకొని రాయచోటికి వెళ్లి తహసీల్దార్‌ను కలిశారు. కొత్తపల్లి-3 గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయ రెడ్డి లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో మరణించినట్లు నమోదైనట్లు అదికారులు గుర్తించారు. ఆరా తీయగా భార్యే వీఆర్వోతో కలిసి ఈ పనిచేసినట్లు తేలింది. దీంతో అక్రమంగా తాను చనిపోయినట్లు రికార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gram volunteer, Kadapa, Ysr pension scheme