Lok Sabha Election 2019 : స్వామి కార్యం, స్వకార్యం, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా... తన విదేశీ పర్యటనను జగన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగించబోతున్నారా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్... ఐదు రోజుల స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లగానే... రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఓ అంశం అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కాగానే... జపాన్, సింగపూర్ టెక్నాలజీలతో రాజధాని అమరావతిని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. ఐతే... అది అనుకున్న స్థాయిలో పట్టాలెక్కలేదు. ఇంకా చెప్పాలంటే... అంచనాల్ని అందుకోలేదు. చాలా వరకూ ప్లానింగ్ దశలోనే ఉంది. ఫలితంగా ఈ ఐదేళ్లలో ఆశించిన రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదన్న విమర్శలు కొంతవరకూ టీడీపీ ఎందుర్కొంటోంది. ఇప్పుడు ఐదు రోజుల పర్యటనకు వెళ్లిన జగన్... అక్కడికి వెళ్లిన తర్వాత... అమరావతి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని తెలిసింది.
మే 23 తర్వాత తానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అవుతానని 100 శాతం నమ్ముతున్న జగన్... ఆ తర్వాతేంటి అన్నదానిపై లోతుగా ఆలోచిస్తున్నారనీ, స్విట్జర్లాండ్ వెళ్లాక... అక్కడి అద్భుత పర్యాటక ప్రదేశాలు, ఆ దేశపు టెక్నాలజీ, అభివృద్ధీ చూశాక... ఏపీ రాజధాని అమరావతి కూడా అదే స్థాయిలో అద్భుతమైన టెక్నాలజీతో అదిరిపోవాలని జగన్ భావించినట్లు తెలిసింది. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా వేగంగా అమరావతి నిర్మాణం జరగకపోతే, చంద్రబాబు లాగా తానూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అది 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది కలిగిస్తుందని ఒకింత మదన పడినట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వస్తే... రాజధానిని అమరావతి నుంచీ తరలిస్తారన్న టీడీపీ విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలైనంత త్వరగా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలనీ, అందుకు స్విట్జర్లాండ్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నట్లు తెలిసింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్విట్జర్లాండ్ తటస్థంగా ఉండటంతో... ఆ దేశం ఏ యుద్ధాలలోనూ పాల్గొనలేదు. ఫలితంగా వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు స్విట్జర్లాండ్ అంటే ఓ కలల స్వర్గం. పర్యాటకులకు స్వర్గ ధామం. ప్రతి ఒక్కరూ తమ దేశం కూడా స్విట్జర్లాండ్ లాగా అభివృద్ధి చెందాలని భావిస్తుండటం సహజం. అంతలా అందర్నీ ఆకట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఆ దేశం. స్విట్జర్లాండే ఆదర్శంగా, అక్కడి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, ఆ దేశ అభివృద్ధే మోడల్‌గా జగన్ కూడా అమరావతికి సరికొత్త రూపు ఇవ్వబోతున్నారని తెలిసింది.
చంద్రబాబు లాగా లోతైన ప్లాన్స్ వేస్తూ, లోతైన డిజైన్లు చేయిస్తూ.... ఎక్కువ టైం రూపు రేఖలకే కేటాయిస్తూ ఉండిపోకుండా... వెంటనే ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగేలా బలమైన చర్యలు తీసుకోవాలని జగన్ తనదైన లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న ఆయన హైదరాబాద్ వచ్చి... పార్టీ నేతలతో సమావేశం అవ్వబోతున్నారు. ఆ మీటింగ్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలిసింది. మొత్తానికి సరదాగా ఎంజాయ్ చెయ్యడానికి అంటూ వెళ్లిన తమ పార్టీ అధినేత... తీరా అక్కడికి వెళ్లగానే... అమరావతి నిర్మాణంపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టడం రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పరిణామమే అంటున్నాయి వైసీపీ వర్గాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.