(సయ్యద్ అహ్మద్ - న్యూస్18తెలుగు కరెస్పాండెంట్)
తెలంగాణ నుంచీ ఏపీకి ప్రైవేట్ ట్రావెల్స్‌లో వెళ్లే వాళ్లు చాలా మంది కావేరీ ట్రావెల్స్‌ని ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే... వాళ్లకు చాలా బస్సులు ఉండటంతో... ప్రజలు ఆ ట్రావెల్స్‌లో వెళ్తున్నారు. అలాంటిది... సరిగ్గా అవసరమైనప్పుడు... కీలకమైన ఎన్నికల టైంలో... పోలింగ్‌కి ఇంకా ఒక్క రోజే టైం ఉండగా... ఇవాళ వెళ్లాల్సిన 125 బస్సుల్ని కావేరీ ట్రావెల్స్ రద్దు చేసింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా రిజర్వ్ చేసుకున్న వారి డబ్బులు వాపసు చేస్తామని వాట్సాప్ గ్రూప్‌లో తాపీగా మెసేజ్ పెట్టింది. ఈ బస్సులన్నీ 100 శాతం రిజర్వ్ అయినవే! దీంతో టికెట్లు రిజర్వ్ చేసుకున్న దాదాపు 5,000 మంది ఓటేసేందుకు ఎలా వెళ్లాలి దేవుడా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.
మరో ట్రావెల్స్ ఏజెన్సీకి చెందిన 10 సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఏపీ-తెలంగాణల్లో బస్సులు నడిపే లైసెన్స్ లేదని, ఆ ట్రావెల్స్ కేవలం ఏపీలోనే సర్వీసులు నడుపుకోవాలని తెలంగాణ ఆర్టీఏ ఆదేశించడంతో ట్రావెల్స్ యాజమాన్యం ఆ బస్సులను రద్దు చేసింది. దీంతో సకాలంలో ఏపీకి వచ్చి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
గురువారం (11వ తేదీ) ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోని ఆంధ్రా ప్రజలు టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లోనూ సీట్లను రిజర్వ్ చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి నడిచే ఆరెంజ్, మార్నింగ్ స్టార్, దివాకర్, వీరభద్ర వంటి ట్రావెల్స్తో పాటూ కావేరి ట్రావెల్స్ లోనూ టికెట్లు బుక్ చేసుకున్నారు.
కావేరీ ట్రావెల్స్ ఒకేసారి 125 బస్సులను రద్దు చేయడంతో ఇప్పుడు వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా... తెలంగాణలో బస్సులు రద్దవుతుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ అప్రమత్తమైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఈ నెల 10, 11న ఏపీకి సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సరిపడా డ్రైవర్లు లేని కారణంగానే 10న ఏపీకి వెళ్లాల్సిన 125 బస్సులను రద్దు చేసినట్లు కావేరి సంస్థ చెబుతోంది. కానీ కావేరి సంస్థలోని నలుగురు భాగస్వాముల మధ్య వివాదమే దీనికి కారణమని తెలిసింది. కాగా... ఏపీకి నడిపే బస్సుల్లో సీట్లు రిజర్వ్ అయినవాటిని రద్దు చేస్తున్నట్లుగా వస్తున్న వదంతులను నమ్మొద్దని టీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఒక్క బస్సును కూడా రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల కోసం ఏపీకి రెగ్యులర్‌గా నడిపే బస్సులకు తోడు అవసరాన్ని బట్టి అదనపు బస్సులను కూడా నడుపుతున్నామని తెలిపారు.
అదనంగా 300 బస్సులు అందుబాటులో ఉన్నాయని టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్, రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఏపీలో పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉండడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లో టికెట్ల ఛార్జీలు... విమాన చార్జీలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు ఏసీ స్లీపర్ బస్సులో ఛార్జీ రూ.3700 వరకు ఉండగా... విమాన చార్జీ రూ.5,000 వరకే ఉంది. బస్సు దొరక్కపోతే రైలులోనైనా వెళ్లొచ్చన్న వారికి వెయిటింగ్ లిస్ట్ నిరాశే మిగుల్చుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి... సంక్రాంతి సందడిని తలపిస్తోంది. ఏపీలో ఎన్నికల కోసం తాము 48 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే చెబుతున్నా అవి సరిపోవట్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.