మోకాళ్లపై కూర్చుని చంద్రబాబుకు దండం పెడుతున్న ఈ పోలీసు ఎవరు?

చంద్రబాబును బతిమాలుతున్న పోలీసులు(Image-Twitter)

రేణిగుంటలో చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.రేణిగుంటలో చంద్రబాబు డ్రామా చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

 • Share this:
  తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన ముందస్తు అనుమతి లేకుండా పర్యటిస్తున్నారంటూ పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు విమానాశ్రయంలోనే నేల మీద కూర్చున్నారు. అక్కడ ఓ ఫొటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబునాయుడు అక్కడే కూర్చోవడంతో ఆ పోలీసు అధికారి మోకాళ్లపై కూర్చుని విజ్ఞప్తి చేశారు. " సార్.. మీరు పెద్దవాళ్లు.. ఇక్కడ కూర్చొవడం బాగోదు, వేరే చోట కూర్చొండి" అని చెప్పారు. ఆ ఫొటో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ పోలీసు ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

  విమానాశ్రయంలో చంద్రబాబు వద్ద మోకాళ్లపై కూర్చుని దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తున్న వ్యక్తి మునిరామయ్య. తిరుపతి ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. తాను ఎస్పీ దగ్గరకు వెళ్తానని చెప్పారు. అయితే పోలీసులు ఎస్పీనే ఇక్కడికి పిలిపిస్తున్నామంటూ సమాధానం ఇచ్చారు. అయితే తాను అంత పెద్దవాడిని కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో తనను పోలీసులు అడ్డుకున్న వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పోలీసు చర్యలతో తమను అడ్డుకోలేరని ట్వీట్ చేశారు.

  మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విమానాశ్రయంలో హైడ్రామా నడుస్తోంది. చంద్రబాబు అక్కడే నేలపై కూర్చున్నారు. ఆయనకు దగ్గరగా ఉన్న అందరి వద్ద ఉన్న ఫోన్లను పోలీసులు తీసేసుకున్నట్టు తెలిసింది. వారెవరూ ఫొటోలు, వీడియోలు తీయనివ్వకుండా సెల్ ఫోన్లను పోలీసులు తీసుకున్నట్టు సమాచారం. రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబును తిరిగి హైదరాబాద్ పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన మాత్రం తనను బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

  రేణిగుంటలో చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రేణిగుంటలో చంద్రబాబు డ్రామా చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖకు వెళ్లిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా అడ్డుకున్నారని వారు ప్రశ్నించారు.

  తాను కలెక్టర్‌ను కలుస్తానంటూ చంద్రబాబు భీష్మించడంతో ఆయనకు నచ్చజెప్పి తిరిగి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ, జాయింట్ కలెక్టర్ రేణిగుంట చేరుకున్నారు. ఆయనకు నచ్చజెప్పడానికి చూస్తున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: