వాన పడితే ఇక్కడ వజ్రాలు దొరుకును..

గత ఏడాది కేవలం నెల రోజుల వ్యవధిలో దాదాపు 7 వజ్రాలు దొరికాయి. ఈ ప్రాంతాల్లో వజ్రం దొరికిందని తెలిస్తే చాలు విషయం తెలుసుకున్న మరుక్షణమే వ్యాపారులు తమ ముందు ఇట్టే వాలి పోయి బేరసారాలు కొనసాగిస్తారు.

news18-telugu
Updated: June 14, 2019, 4:51 PM IST
వాన పడితే ఇక్కడ వజ్రాలు దొరుకును..
ప్రతీకాత్మక చిత్రం (Image:Facebook)
news18-telugu
Updated: June 14, 2019, 4:51 PM IST
కరువు సీమ రాయలసీమ వరుణుడి కరుణతో రతనాల సీమగా మారింది. తొలకరి వర్షాలు ప్రారంభమవడంతో వజ్రాల వేట మొదలైంది. దీంతో భారీ సంఖ్య లో వజ్రాలు అన్వేషిస్తున్న ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి కర్నూలు-అనంతపురం జిల్లాల సరిహద్దులకు చేరుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణ శివార్లలో పది కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా లక్షలు విలువ చేసే వజ్రాలు దొరుతున్నాయి. ఈ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి మొత్తం రాష్ట్రం అంతా పాకడంతో ఇక్కడకు చాలా మంది వస్తూ వుంటారు. మృగశిర కార్తిలో తొలకరి వర్షాలు కురవడంతో పలు రాష్ట్రాల నుంచి ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వజ్రాల అన్వేషణకు పెద్ద ఎత్తున భారీ సంఖ్య లో వస్తుంటారు.

అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని భూముల్లోనూ వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో జనం ఇక్కడికి కూడా భారీగానే వస్తుంటారు. జూన్ నెలలో తొలకరి చినుకులు వస్తున్నాయంటే చాలు వజ్రాల వేటకు సుదూర ప్రాంతాల నుంచి జనం తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడకు వచ్చి వజ్రాల అన్వేషణ సాగిస్తుంటారు. ఇక్కడకు వచ్చే వారంతా నిరుపేదలే. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలు... తమకు ఒక్క వజ్రం దొరికితే చాలు కష్టాలు తీరిపోతాయని భావిస్తుంటారు.

దొరికిన వజ్రాలను కొనడానికి కూడా వ్యాపారులు ఇక్కడే వుంటారు. వజ్రం దొరికిన విషయాన్ని, దాన్ని అమ్మిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. పోలీసులు రెవెన్యూ అధికారుల భయంతో వజ్రం దొరికిన సంగతి బహిర్గతం చేయకుండా వ్యాపారులు ఇచ్చినంత తీసుకుని వెళ్తుంటారు. అయితే ఇలా ఏడాది పొడవునా కూలీనాలీ చేసి కూడబెట్టిన డబ్బుతో వజ్రాల వేటకు వస్తున్న వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కనీసం ఒక వజ్రం దొరికినా తమ ఆశలు నెరవేరక పోతాయా అని చాలా ఆశతో వజ్రాల వేటకు వస్తుంటారు.

గత ఏడాది కేవలం నెల రోజుల వ్యవధిలో దాదాపు 7 వజ్రాలు దొరికాయి. ఈ ప్రాంతాల్లో వజ్రం దొరికిందని తెలిస్తే చాలు విషయం తెలుసుకున్న మరుక్షణమే వ్యాపారులు తమ ముందు ఇట్టే వాలి పోయి బేరసారాలు కొనసాగిస్తారు. అనంతపురం జిల్లా లోని వజ్రకరూర్, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి లలో దొరికే వజ్రాలు నాణ్యమైనవని 50 ఏళ్ల క్రిందటే శాస్త్రవేత్తలు నిర్దారించారని ఇక్కడికి వచ్చేవారు చెప్తుంటారు. ఈ వజ్రాల వేట సాగుతున్న విషయం అధికారులకూ, పోలీసులకూ తెలిసినా జనం పొట్ట కూటి కోసం చేసే పోరాటం గానే దీన్ని పరిగణిస్తుంటారు. అందుకే కేసుల పేరిట వేధింపులు కూడా ఇక్కడ కనిపించవు. ఇదే అదనుగా జనం వజ్రకరూరు, జొన్నగిరి ప్రాంతాలకు వర్షకాలంలో వస్తుంటారు. అందిన కాడికి చిన్నా చితకా వజ్రాలు తీసుకుని ఇక్కడే అమ్ముకుని ఆ డబ్బులతో స్వస్ధలాలకు వెళ్లిపోతారు.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...