వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ అమ్మాయి తరపువారు వారిపెళ్లికి బ్రేకులు వేశారు. అబ్బాయి ప్రవర్తన సరిగా ఉండదనీ, అతడితో పెళ్లి చేస్తే ఆమె భవిష్యత్ బాగుండదని భావించారు. అందుకే అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు నో చెప్పారు. అంతేకాదు ఆ యువతికి మరో సంబంధం కూడా చూశారు. దీంతో ఆ ప్రియుడికి కోపం తన్నుకొచ్చింది. పెళ్లి రోజు దగ్గరపడేకొద్దీ ఏం చేయాలో అతడికి తోచలేదు. చివరకు ఎలాగోలా కష్టపడి పెళ్లికొడుకు ఫోన్ నెంబర్ ను పట్టేశాడు. అతడి ఫోన్ నెంబర్ కు ఓ మెసేజ్ పెట్టాడు. అంతే ఆ పెళ్లి కొడుక్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ పెళ్లి నాకొద్దంటూ ఆ పెళ్లికొడుకు భీష్మించుకుని కూర్చున్నాడు. మొత్తానికి ప్రియుడు చేసిన నిర్వాకానికి ప్రేయసి పెళ్లి ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన ఓ యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరి వ్యవహారం ఇళ్లల్లో తెలియడంతో పెద్ద రభసే జరిగింది. ఇద్దరి పెళ్లికి తమకు అభ్యంతరం లేదని అబ్బాయి తరపు వారు చెప్పినా, అమ్మాయి తరపు వారు మాత్రం ఒప్పుకోలేదు. అతడి ప్రవర్తన సరిగా ఉండదనీ, భవిష్యత్తులో తమ కూతురికి ఇబ్బందులు వస్తాయని భావించి ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు. అంతటితో ఆగక, ఆ యువతికి మరో సంబంధం చూశారు. బుధవారం వేరే వ్యక్తితో ఆ యువకుడి ప్రియురాలి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ప్రియుడు చేసిన నిర్వాకంతో ఆ పెళ్లి పెటాకులు అయింది.
పెళ్లి రోజు దగ్గరపడే కొద్దీ ఏం చేయాలా అని ప్రియుడు టెన్షన్ పడ్డాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి భార్య అవుతోందని తెగ బాధపడ్డాడు. పెళ్లిని ఆపేందుకు మార్గాలను అన్వేషించాడు. చివరకు ఎలా సంపాదించాడో ఏమో కానీ,పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ ను దొరకబుచ్చుకున్నాడు. ఆ పెళ్లికొడుకు వాట్సప్ కు తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను పంపాడు. తమ ప్రేమ గురించి వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. వాళ్లిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూసిన పెళ్లి కొడుక్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయితో తనకు పెళ్లి వద్దని తన తల్లిదండ్రులకు చెప్పేశాడు. దీంతో తల్లిదండ్రులు అమ్మాయి తరపు వారికి సమాచారం ఇచ్చారు. మొత్తానికి బుధవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ప్రియుడి నిర్వాకం వల్లే తమకూతురి పెళ్లి ఆగిపోయిందని తెలిసిన యువతి తల్లిదండ్రులకు తెలిసింది. అంతే అతడిని నిలదీశారు. యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ప్రేయసి పెళ్లిని ఆపేందుకు ఆ ప్రియుడు పడిన రిస్క్ గురించి ఆ ఊళ్లో తెగ చర్చనీయాంశంగా మారింది.
Published by:Hasaan Kandula
First published:January 21, 2021, 15:38 IST