విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన స్టెరిన్ గ్యాస్ వల్ల వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 15000 మంది ప్రజలు భయకంపితులు అయ్యారు. బాధితులు చాలా మంది రోడ్ల మీద పడిపోయారు. ఆ దృశ్యాలు టీవీల్లో చూసిన ప్రజలు కూడా భయపడ్డారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇది ఒక్కరోజులో ముగిసిపోయే అంశం కాదు. దీని నుంచి ప్రజలను కాపాడుడుకోవడానికి ఏమేం చేయాలి? ఈ అంశాలను మనకు వివరించారు డాక్టర్ ఎం. బాపూజీ (సీఎస్ఐఆర్ సైంటిస్ట్, రిటైర్డ్ ). ఆంధ్రా యూనివర్సిటీ ఓల్డ్ కెమిస్ట్రీ స్టూడెంట్ అయిన డా.బాపూజీ న్యూస్18కి పలు ముఖ్యమైన విషయాలను తెలియజేశారు.
ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ అయింది కాబట్టి ఇది కేవలం ఆ కంపెనీ బాధ్యత మాత్రమే కాదు. విశాఖ, విజయనగరం చుట్టుపక్కల ఇంకా చాలా కెమికల్, డ్రగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రేపు మరో కంపెనీలో జరగొచ్చు. ఇలాంటి వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు వివిధ రంగాల వారు ముందుకు రావాలి.
ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్, కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ కూడా తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి. కెమికల్ అండ్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ కూడా ముందుకు రావాలి. వివిధ రంగాలకు చెందిన మేధావుల సాయం తీసుకోవాలి. మెటీరియల్, ఫెసిలిటీస్‌ను అందిపుచ్చుకోవాలి.
ఇక వాతావరణ శాఖ కూడా ముఖ్యపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, లీక్ అయిన గ్యాస్ గాల్లో కలిసింది. అది ఒక రోజుతో పోదు. కనీసం మూడు నాలుగు రోజుల పాటు గాల్లోనే ఉంటుంది. గాల్లో కలిసిన గ్యాస్ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పైకి వెళ్తుంది. రాత్రి సమయాల్లో మళ్లీ కిందకు దిగుతుంది. గాలి ఎటువైపు వీస్తే అటువైపు మళ్లుతుంది. మూడు, నాలుగు రోజుల పాటు గాల్లోనే గ్యాస్ ఉంటుంది కాబట్టి గాలి, ఎండ, తేమ శాతాన్ని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి.
స్టెరిన్ గ్యాస్ అనేది హైడ్రో కార్బన్. నీళ్లలో కరిగే గ్యాస్ కాదు. స్టెరిన్ గ్యాస్ మనకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. కాబట్టి, ముందుగా ప్రజలకు ఆక్సిజన్ అందేలా చూడాలి. ప్రజలను ఆక్సిజన్ సిలిండర్ల వద్దకు తీసుకుని వెళ్లడమా? లేకపోతే సిలిండర్లనే ప్రజలు ఉండే వద్దకు తీసుకుని వెళ్లడమా అనేది అక్కడున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
స్టెరిన్ గ్యాస్ పీల్చిన వారిని మొట్టమొదటిగా ఆ చుట్టుపక్కల నుంచి తరలించాలి. గాలి పీల్చిన వారికి ఫస్ట్ అయిడ్ అవసరం. వారికి ఆక్సిజన్ అందించడం ఒకటైతే, ఆక్సిజన్ అందుబాటులో లేని సమయంలో బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి. అంటే గట్టిగా దగ్గడం లాగా అన్నమాట.
ఫ్యాక్టరీలో మంటలు వస్తే దాని మీద నీళ్లు కొట్టి ఆర్పేయవచ్చు. కానీ, ఈ గ్యాస్ నీటిలో కరగదు. దానికి కెమికల్ రియాక్షన్ చేయాలి. ఆ తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. దానికి వాక్యూమ్ పంప్స్ కావాలి.
ప్రస్తుతం ట్యాంకర్లో గ్యాస్ ఎంత ఉందో పరిశీలించాలి. ఒకవేళ చాలా తక్కువ స్థాయిలో ఉంటే, దాన్ని మంట పెట్టి మండించవచ్చు. అయితే, చుట్టుపక్కల ఎలాంటి ప్రమాదం లేకుండా.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.