Home /News /andhra-pradesh /

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?

చంద్రబాబు, జగన్, నరేంద్ర మోదీ

చంద్రబాబు, జగన్, నరేంద్ర మోదీ

AP New CM YS Jagan : సాధారణంగా ముఖ్యమంత్రులు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల్ని వెలికి తీస్తుంటారు. జగన్ ఏం చేయబోతున్నారు. ఎలా ముందుకెళ్లబోతున్నారు.

రెండోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఏపీ కాబోయే సీఎం వైఎస్ జగన్ కొన్ని సంచలన ప్రకటనలు చేశారు. వాటిలో మొదటిది... కుంభకోణాలు. గత ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు జరిగాయన్న ఆయన... వాటిపై శాఖల వారీగా సమీక్షలు చేసి... అక్రమాల్ని బయటపెడతానన్నారు. రెండోది రాజధాని భూములు. రాజధాని ఎక్కడ వస్తుందో డిసైడ్ చేసిన చంద్రబాబు... ముందుగానే తన బినామీలతో అమరావతి చుట్టుపక్కల భూములు కొనిపించారనీ, రైతుల నుంచీ బలవంతంగా భూములు లాక్కున్నారనీ, ఆ భారీ స్కాంను బయటపెడతానని అన్నారు. మూడోది పోలవరం టెండర్. పోలవర్ ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరిగాయన్న జగన్... అవసరమైతే... కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు.

ఈ ప్రకటనలను బట్టీ అర్థమయ్యేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గతాన్ని తవ్వబోతున్నారన్న మాట. అలా చేస్తే, కచ్చితంగా కొన్ని అవినీతి అంశాలు వెలుగులోకి రావడం ఖాయం. అది టీడీపీ, వైసీపీ మధ్య చిచ్చును మరింత రాజేయడం సాధారణ అంశమే. నిజానికి టీడీపీ హయాంలో క్షేత్రస్థాయిలో అవినీతి ఓ రేంజ్‌లో జరిగిందన్నది కఠిన వాస్తవం. అధికారులు ఇష్టమొచ్చినట్లు లంచాలు లాగేశారు. ఏసీబీ జరిపిన దాడుల్లో ఒక్కో అధికారి దగ్గరా వంద కోట్లకు పైగానే అక్రమ సంపాదన ఉన్నట్లు తేలిందంటే... ఎంత మంది అధికారులు ఎంతలా దోచేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు గత ప్రభుత్వానికి తెలియనివి కావు. అయినా సరే పట్టించుకోకపోవడం వల్ల, విసుగెత్తిన ప్రజలు... ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.

జగన్ చెప్పినట్లు గత ప్రభుత్వ అక్రమాల్ని తవ్వడం మొదలుపెడితే, అవి ఓ పట్టాన తేలవు. దృష్టంతా వాటిపై పెడితే, రాష్ట్ర అభివృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంది. గతాన్ని తవ్వడం కంటే ముఖ్యమైన అంశం అభివృద్ధి. ప్రజలు జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ నవరత్నాలు, ఇతరత్రా హామీలన్నీ వెంటనే అమలు చెయ్యాల్సి ఉంది. అందుకోసం నిధులు సమీకరించడం మరో కీలక అంశం. నిధులు కావాలంటే పరిశ్రమలు రావాలి. పన్నుల ఆదాయం పెరగాలి. లేదా పన్నులు సక్రమంగా వసూలవ్వాలి. ఇలాంటి అంశాలపై దృష్టి సారించకపోతే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు ఆర్థిక వేత్తలు.

జగన్ చెప్పినట్లు ఆరు నెలల్లో ఆయన మంచి సీఎంగా గుర్తింపు పొందాలంటే... ఆయన టీడీపీని ఎంతలా చిక్కుల్లో పడేశారన్న అంశం కంటే, పేదలను ఎంతలా ఆదుకున్నారన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అవినీతి ఆరోపణలు, అక్రమాలపై ఓవైపు దర్యాప్తు జరిపిస్తూనే... మరోవైపు అంతకంటే ఎక్కువ శ్రద్ధ సంక్షేమ పథకాలపై పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను లైట్ తీసుకుంటే, మళ్లీ అదే అవినీతి ఊడలు పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడెప్పుడో చాణక్యుడు చెప్పినట్లు... కేంద్రంలో బలమైన రాజు (బలమైన ప్రభుత్వం) ఉండాలి. అదే సమయంలో ఆ రాజుకు (ప్రభుత్వానికి) అన్ని అంశాలతోపాటూ... చిట్టచివరి సరిహద్దుల్లో (క్షేత్రస్థాయిలో) ఏం జరుగుతుందో కూడా ప్రతి రోజూ తెలియాలి.

ఇలాంటి ఎన్నో అంశాల మధ్య, దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం జగన్ ముందున్న పెద్ద సవాలు అంటున్నారు ఆర్థిక వేత్తలు. అలాగే గత ప్రభుత్వం అమరావతి విషయంలో చేసిన పొరపాట్లు జగన్ చెయ్యకుండా... వేగంగా అమరావతిని నిర్మిస్తే... ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారవుతారని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు