ఇప్పటివరకూ వైసీపీ అధినేత లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే అని అంతా అనుకున్నారు. కానీ జగన్ అంతకుమించిన కొన్ని వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారని తాజాగా తెలిసింది. ప్రస్తుతం స్వి్ట్జర్లాండ్లో ఫ్యామిలీతో సేద తీరుతున్న ఆయన... తిరిగి రాగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్‌గా ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై చర్చించబోతున్నారని తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి రెండు ఫెడరల్ ఫ్రంట్‌కు దాదాపు 40 లోక్ సభ స్థానాలు వస్తాయని టీఆర్ఎస్, వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అన్ని సీట్లు రావడం వల్ల కేంద్ర స్థాయిలో చక్రం తిప్పొచ్చనీ, తెలుగు రాష్ట్రాల డిమాండ్లు కలసికట్టుగా సాధించుకోవచ్చని కేసీఆర్, జగన్ నమ్ముతున్నట్లు తెలిసింది. ఐతే... ఇదే భేటీలో తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్‌ను బలహీనపరిచి... తాము బలపడేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందో, ఏపీలో కూడా టీడీపీని బలహీనపరిచి, వైసీపీ బలపడేందుకు ఏం చేయాలన్న అంశంపైనా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
ఓ అంచనా ప్రకారం మే 23 తర్వాత ఏపీ సీఎం పీఠం ఎక్కాలనుకుంటున్న జగన్... ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలపై ఈ ఏడాది మొత్తం దృష్టి కేంద్రీకరించబోతున్నారని తెలిసింది. ఆ తర్వాత టీడీపీ టార్గెట్‌గా వ్యూహాలు అమలు చేస్తారని తెలిసింది. టీడీపీకి చెందిన నేతలను వైసీపీలో కలిపేసుకోవడమే కాకుండా... టీడీపీ కార్యకర్తల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి... ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే... ఇలాంటి అంశంపై ఇప్పటివరకూ జగన్ ఎక్కడా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కనీసం టీడీపీని ఏపీ నుంచీ తుడిచిపెడతానని ఎప్పుడూ అనలేదు. ఎంతసేపూ రాజన్న రాజ్యం వస్తుందని మాత్రమే చెబుతూవచ్చారు. ఐతే... తెలంగాణలో ఎలాగైతే టీడీపీ నేతల్లో చాలా మంది టీఆర్ఎస్లో చేరిపోయారో... ఏపీలో కూడా వైసీపీ అధికారంలోకి రాగానే... వైసీపీలోకి వలసలు మొదలవుతాయని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
టార్గెట్ చంద్రబాబు : జగన్‌పై 31 కేసులు ఉన్నాయనీ, జగన్ సీఎం అయితే... ఎప్పుడోకప్పుడు జైలుకెళ్లక తప్పదని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే... చంద్రబాబే లక్ష్యంగా జగన్ రాజకీయ చతురత ప్రదర్శిస్తారనీ, చంద్రబాబుపై ఉన్న పాత కేసుల్ని తిరగదోడతారని తెలుస్తోంది. ముఖ్యంగా బాబ్లీ ప్రాజెక్టు కేసు, తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం, సింగపూర్‌లో ఆస్తుల ఆరోపణలు వంటి పాత అంశాల్ని తెరపైకి తెచ్చి... చట్టపరంగా చంద్రబాబును ఇరకాటంలో పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదని ప్రకటనలు చేశారు. 2020 నుంచీ ఈ దిశగా జగన్ వ్యూహాలు రచిస్తారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ బలహీనపడితే... అది వైసీపీకి కలిసొచ్చే అంశం. అందువల్ల అధికారంలోకి రాగానే... పార్టీని మరింత బలపడేలా చేసుకునేందుకు వీలయ్యే అన్ని అంశాల్నీ జగన్ పరిశీలిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐతే ఇదంతా వైసీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యం. ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో ఎవరికీ తెలియదు. ఆ సస్పెన్స్ వీడేందుకు మే 23 వరకూ మనం ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.