తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని పర్ఫెక్టుగా అంచనా వేసిన సర్వేల సంస్థ ఆరా (AARAA)... తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తన సర్వే ఫలితాల్ని అనధికారికంగా వెల్లడించింది. ఆ ఫలితాలు ప్రకారం... ఏపీలో వైసీపీకి 120కి పైగా సీట్లు రాబోతున్నాయి. అసలీ సర్వేను నమ్మాల్సిన అవసరం ఏంటన్నది మొదటి ప్రశ్న. దీనికి ఆ సంస్థ సమాధానం కూడా ఇచ్చింది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా... టీఆర్ఎస్కి 85కి పైగా స్థానాలు వస్తాయని తెలిపింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. అలాగే 2016లో జరిగిన GHMC ఎన్నికల్లో... టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలుస్తుందని ఆరా చెప్పింది. సరిగ్గా అదే జరిగింది కూడా. ఇలా పర్ఫెక్టుగా లెక్కలేస్తున్న ఆరాపై పూర్తి పాజిటివ్ ఫీల్ ఏర్పరచుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆసక్తి కొద్దీ ఆయన... ఈ సంస్థతో... ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సర్వే చేయించారని తెలిసింది.
2008లో ఏర్పడిన ఆరా ఇప్పటివరకూ కొన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. 2009 సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆరా చెప్పినట్లే... వైఎస్ రాజశేఖర రెడ్డి (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చారు. 2009 జార్ఖండ్ అసెంబ్లీ, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా ఫలితాలు దాదాపు అసలు ఫలితాలతో సరిపోలాయి. 2012లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆరా కచ్చితమైన అంచనాలు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆరా చెప్పింది అదే జరిగింది కూడా. ఇలా చెప్పిన ప్రతిసారీ... వాస్తవ ఫలితాలకు దగ్గరగా తన ఫలితాల్ని వెల్లడిస్తూ సక్సెస్ అవుతోంది ఆరా.
తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండుసార్లు, ఎన్నికల తర్వాత ఒకసారీ సర్వే చేసింది ఆరా. ఈ సర్వేల్లో వైసీపీకి 120 నుంచీ 125 సీట్లు వస్తాయని తేలింది. అలాగే 20 దాకా ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని సమాచారం. కొన్ని ఇతర సర్వేల్లో చెప్పినట్లే... టీడీపీకి 50 సీట్ల లోపే వస్తాయని ఆరా సర్వేలో కూడా తేలింది.
రోజాకి షాక్ తప్పదా :వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న, జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా చేస్తున్న రోజా... మరోసారి నగరి నుంచీ పోటీ చేశారు. ఐతే... ఆరా సర్వే ప్రకారం ఈసారి ఆమె ఓడిపోతారని తెలుస్తోంది. ఈ అంశాన్ని కొన్ని విశ్లేషణలు కూడా బలపరుస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే... జగన్ పార్టీలో రోజాకు లేడీ కోటాలో హోంమంత్రి పదవి ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల కొందరు వైసీపీ నేతలే నగరిలో రోజా ఓటమికి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలోనే కొందరు సీనియర్ నేతలు... రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి రేసులో పోటీ వస్తుందని ఆమె ఓటమికి ఎన్నికలకు ముందే ప్రణాళికలు రచించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు కొందరు రోజా ఓటమికి తెరవెనుక చక్రం తిప్పినట్లు భోగట్టా. ఇదే జరిగితే... రోజాకు మంత్రి పదవి అందని ద్రాక్షే అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.