కొన్నిసార్లు కొన్ని ఘటనలు కాస్త విచిత్రంగా ఉంటాయి. చిన్నచిన్న కారణాలే మనిషి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. చెప్పడానికి, వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. బాధపడేవారికి అసలు నొప్పి తెలుస్తుంది. అరటి పండు తింటే పన్ను ఊడినట్లు ఓ వ్యక్తి వింత కారణానికి ఆస్పత్రిపాలయ్యాడు. ఫ్రై చేసుకొని తినాల్సిన రొయ్య.. ఓ రైతును పరుగులు పెట్టించింది. వేలెడంత లేని రొయ్య.. అది అది కూడా నీళ్లలో లేకుండా కాసేపు బ్రతకలేని రొయ్య మనిషి ప్రాణాలమీదకు తెచ్చిందంటే నమ్ముతారా..? చాలా మంది ఇది జోక్ అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో ఓ రొయ్య మనిషిని ప్రాణాలమీదకు తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం పరిసర ప్రాంతాల్లో ఓ రైతు రొయ్యల చెరువులో పట్టుబడి చేస్తున్న సమయంలో ఓ రొయ్య ఎగిరి అతడి ముక్కులో దూరింది. అలా రైతు విదిలించగానే కిందపడలేదు సరికదా.. మరింత లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాపం ఆ రైతు పరిస్థితి చూడాలి. ఊపిరాడక విలవిల్లాడిపోయాడు. ఉక్కిరిబిక్కిరయిపోయాడు. వెంటనే స్పందించిన తోటి రైతులు ఆ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వెంటనే డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా ముక్కులో రొయ్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే రొయ్యకు ఉన్న చిన్నచిన్న ముళ్లు ముక్కులోకి దిగబడ్డాయి. ఐతే డాక్టర్లు చాకచక్యంగా వ్యవహరించి ముక్కులో నుంచి శ్వాసకోశ నాళంలోకి ముళ్లు దిగకుండా జాగ్రత్తగా దానిని బయటకు తీశారు.
ఇందులో మరే హైలెట్ ఏంటంటే.. రైతు ప్రాణాలమీదకు తెచ్చిన రొయ్య.. ముక్కులో నుంచి బయటకు తీసినా ఇంకా బ్రతికే ఉంది. దీంతో డాక్టర్లు ముక్కున వేలేసుకున్నారు. ఐతే రైతును సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. మొత్తానికి కాసేపట్లో ఫ్రై కావాల్సిన రొయ్య.. రైతుకి మాత్రం నరకం ఎంట్రన్స్ చూపించింది. ఎంత చిన్నప్రాణి అయినా మనిషి శరీరంలోకి వెళ్లకూడని మార్గంలో వెళ్తే ఇబ్బందేనని ఈ ఘటనతో రుజువైంది.
గతంలో కోళ్లు, కుక్కలు, పిల్లుల, గేదెలు, ఆవులు, ఎద్దుల వంటివి మనిషి ప్రాణాలమీదకు తెచ్చిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు చేపల వల్ల కూడా ప్రాణాలు పోయిన సీన్స్ ఉన్నాయి. ఇక చికెన్ ముక్క నోట్లో ఇరుక్కుపోవడం, చేప ముల్లు గొంతులో దిగిన ఘటనల్లో ప్రాణాలమీదకు వచ్చిన సందర్భాలూ లేకపోలేదు. కానీ రొయ్య వల్ల ప్రాణాల మీదకు రావడం మాత్రం హైలెట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రైతు పరిస్థితి నిలకడగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, West Godavari