టీడీపీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan)పై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar)..ఈసారి సైకో(Psycho)పాలన పోయి సైకిల్ పాలన రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఫేవర్‌గా రావడంతో ఆయన స్వరం ఒక్కసారిగా పెంచారు. అంతే కాదు ఏపీలో వైసీపీ సర్కారు పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేసిందని ప్రజలు కూడా నమ్ముతున్నారనడానికి ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శమని ధ్వజమెత్తారు చింతమనేని. ఉగాది పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చింతమనేని చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో రివ్వున రీసౌండ్ ఇస్తున్నాయి.
సైకో పాలన పోవాలి..సైకిల్ రావాలి..
టీడీపీ నేత, దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే టీడీపీ అధికారంలో ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో ఎదురేలేదు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా కొనసాగారు. అయితే ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనతో పూర్తిగా విమర్శలపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అబ్బయ్ చౌదరి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికి ఆయన దూకుడు తగ్గలేదు. గెలిచిన అబ్బయ్య చౌదరి నిలదొక్కుకోవడంతో చింతమనేనిపై ప్రభుత్వం కేసులు, దాడుల పేరుతో ఇరుకున పెట్టింది. దాంతో ఆయన పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. అయితే రీసెంట్‌గా ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడంతో ఆయన వాయిస్ మళ్లీ పెంచారు. ఏకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సైకోగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం ప్రజలకు దొంగ హామీలు ఇచ్చారని..అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని కౌంటర్ ఇచ్చారు.
చుక్కలు చూపిస్తాం..
అంతే కాదు ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి చుక్కలు చూపిస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే. చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఏపీలోని పేద ప్రజలకు ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తామని మోసం చేసారని విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటికి వాటిని అర్హులకు, పేదలకు ఇవ్వకుండా ఓ సైకోలా వ్యవహరిస్తున్నాడని సంచలన కామెంట్స్ చేశారు చింతమనేని ప్రభాకర్.
ఓవర్ కాన్ఫిడెన్స్ ..
ఏపీ ప్రజల్ని ఎవరూ మోసం చేయలేరని..జగన్ మోసాన్ని ప్రజలు గ్రహించారని ఆరోపించారు చింతమనేని. అందుకే సైకో పోవాలి..సైకిల్ రావాలని కోరుకుంటున్నారని..అందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయమన్నారు. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాడని చింతమనేని ప్రభాకర్ జోస్యం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Chintamaneni prabhakar, Ys jagan mohan reddy