తెలంగాణలో దడ పుట్టిస్తున్న వడగాల్పులు.. ఏపీలో వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

రోహిణి కార్తె ప్రభావంతో తెలంగాణలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 • Share this:
  రోహిణి కార్తె ప్రభావంతో తెలంగాణలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వస్తుండటంతో శరీరానికి తాకితే మంటలు పుడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో 4 రోజుల పాటు కొనసాగుతుతందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ పదో తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ఆ తర్వాత నైరుతి రుతు పవనాల ప్రవేశంతో తగ్గిపోతాయని వెల్లడించింది. వడగాల్పులకు తోడుగా క్యుములోనింబస్‌ మేఘాలు కూడా రాబోయే 4 రోజుల్లో ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సమాచారం.

  ఇక, ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో అండమాన్‌ సముద్ర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ నుంచి మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంగళవారం 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరుగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగనుంది. 29వ తేదీన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. 30న రాయలసీమలో జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ నెల 31 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: