లాక్‌డౌన్ తర్వాత ఉద్యమం.. సీఎం జగన్‌కు పవన్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్, జగన్

లాక్‌డౌన్ తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే విషవాయువు బాధిత ప్రజల కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు పవన్.

 • Share this:
  విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు బాగాలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే విషవాయువు బాధిత ప్రజల కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు పవన్. సోమవారం విశాఖపట్టణం జిల్లా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

  విశాఖపట్టణం రాష్ట్రానికి గుండెకాయ లాంటింది. మన దేశ రక్షణకు సంబంధించి ఈ నగరం కీలకమైనది. అలాంటి నగరంలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ ఘటన ఆందోళనకరమైంది. ఈ పరిశ్రమ నుంచి విడుదలైన విషవాయువు స్టైరీన్ ప్రభావం ఇంకా ఎంతకాలం, ఏ స్థాయిలో ఉంటుందోనన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాధిత గ్రామాలకు భరోసా ఇవ్వడం లేదు. ప్రభుత్వ తీరు మారకుంటే లాక్‌డౌన్ తర్వాత ఉద్యమిస్తాం.
  పవన్ కల్యాణ్

  మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: