Home /News /andhra-pradesh /

WE CANNOT INTERVENE IN CAPITAL DECISION CENTRE FILES AFFIDAVIT IN AP HIGH COURT AK

మాకు సంబంధం లేదు.. రాజధానిపై మరోసారి తేల్చేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాల రాజధానుల విషయంలో తమ పాత్ర ఉండదని గతంలో వెల్లడించిన కేంద్రం.. తాజాగా మరోసారి అదే అంశాన్ని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.

    ఏపీ రాజధాని అంశంపై కొనసాగుతున్న రగడ విషయంలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలే రాజధానిని నిర్ణయించుకుంటాయని తెలిపింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. బిల్లుల రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదని తమ అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఈ అంశంపై నెల 28న తిరిగి విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలోనూ ఈ అంశంపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. అప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తమ పాత్ర ఉండదని గతంలో వెల్లడించిన కేంద్రం.. తాజాగా మరోసారి అదే అంశాన్ని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.

    కొద్దిరోజుల క్రితం ఏపీ గవర్నర్ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టు స్టే కొనసాగుతోంది. ఈ నెల 27 వరకు ఈ రెండు బిల్లులపై స్టే కొనసాగుతుందని ఈ నెల 14 హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ అంశంపై కేసులు ఓ కొలిక్కి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన రాజధానికి శంకుస్థాపన చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై నిన్న హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది.

    రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అందులో వివరించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్టే భావించాలని వెల్లడించింది. ప్రత్యేక హోదా గురించి ప్రతి మీటింగ్‌లో అడుగుతున్నామని తెలిపింది. హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు