హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్‌తో బీజేపీకి సంబంధం లేదట!

చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్‌తో బీజేపీకి సంబంధం లేదట!

కన్నా లక్ష్మీనారాయణ

కన్నా లక్ష్మీనారాయణ

22 సార్లు ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాలేదు కాబట్టే చంద్రబాబు మీద అరెస్ట్ వారెంట్ జారీ అయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

2010 నాటి బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం వెనుక బీజేపీ - టీఆర్ఎస్ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తున్న వేళ.. తమకు ఏమాత్రం సంబంధం లేదని కమలనాధులు స్పష్టం చేశారు. ఏం జరిగినా బీజేపీకి ఆపాదించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి స్పష్టం చేశారు. 2010లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ కేసు కాంగ్రెస్ హయాంలోనే నమోదైందని చెప్పారు. ఇప్పటి వరకు 22సార్లు వాయిదాలకు కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే అరెస్ట్ వారెంట్ వచ్చి ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా చంద్రబాబునాయుడు న్యాయస్థానాన్ని అగౌరవ పరిచారని కన్నా విమర్శించారు. ఇది మెజిస్ట్రేట్ - చంద్రబాబుకి మధ్య ఉన్న సంబంధమే కానీ, తమకు ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ గరుడ పేరుతో బీజేపీపై టీడీపీ నాయకులు కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

అప్పుడు కాంగ్రెస్ హయాంలో కేసులు పెట్టినా.. వాటిని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిరగతోడుతుందన్న టీడీపీ నేతల వాదనను కమలనాధులు ఖండించారు. చంద్రబాబునాయుడు, మరికొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాకుండా, న్యాయస్థానాన్ని ధిక్కరించారు కాబట్టే వారికి అరెస్ట్ వారెంట్ జారీ అయిందన్నారు. కక్ష పూరితంగా వ్యవహరించాలనుకుంటే.. ఎప్పుడో చేయొచ్చని పురందేశ్వరి అన్నారు. అయినా, అలాంటి అలవాటు బీజేపీకి లేదన్నారు. చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ అయితే, బీజేపీకి వచ్చే లాభం ఏంటని ఆమె ప్రశ్నించారు.

ఈనెల 24న ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు - అవకాశాలు అనే అంశంపై ఆయన ప్రసంగించాలని కోరింది. ఆ సదస్సుకు హాజరుకానివ్వకుండా ఉండేందుకు, ఆయన పరువు తీయడానికే బీజేపీ నేతలు కేసులను బయటకు తీస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, టీడీపీ ఆరోపణలను కమలనాధులు తిప్పికొట్టారు. ఇలాంటి ఈర్ష్యతో ఎవరూ రాజకీయాలు చేయరని పురందేశ్వరి అన్నారు.

ఇవి కూడా చదవండి

First published:

Tags: Bjp-tdp, Chandrababu Naidu, Kanna

ఉత్తమ కథలు