ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. 30లక్షల మందికి పైగా పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే 50శాతం మందికి పట్టాలు అందించిన ప్రభుత్వం మరో రెండు వారాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అక్కడక్కడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చోటా మోటా నాయకులు, అధికారులు లక్షల్లో వసూలు చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ ఓ వాలంటీర్ లక్షల రూపాయలు వసూలు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరంలోని నాలుగో డివిజన్ పరిధిలో ఓ వార్డు వాలంటీర్ ఇళ్ల పట్టాల పంపిణీని క్యాష్ చేసుకున్నాడు. సిటీలోని ఓ మంచి ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తూనంటూ ఒక్కోక్కరి నుంచి రూ.10వేల చొప్పున 37 మంది నుంచి దాదాపు రూ.4లక్షలు వరకు దండుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపణీ ప్రారంభించినా ఇంతవరకు తమకు అందజేయకపోవడంతో అనుమానం వచ్చి అతడ్ని నిలదీశారు. బాధితులు ఈ వ్యవహారాన్ని స్థానిక అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లగా.. ఓ ప్రముఖుడు సర్దుబాటుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వ్యవహారంలో వాలంటరీ తో పాటు నాలుగో డివిజన్ వార్డు సచివాలయనికి చెందిన అడ్మిన్ సెక్రటరీకి కూడా పాత్ర ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అడ్మిన్ సెక్రటరీని కార్పొరేషన్ కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేసినట్లు కూడా చెప్తున్నారు.
ఐతే కార్పొరేషన్ అధికారులు మాత్రం వాలంటీర్ డబ్బులు వసూలు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. ఐతే స్థానికులు మాత్రం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
ఒక్క చిత్తూరులోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఇళ్ల పట్టాల పంపిణీపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్.. ఎవరైనా డబ్బులడిగితే చెట్టుకు కట్టేసి కొట్టాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం బృహత్తర లక్ష్యంతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కింది స్థాయి ఉద్యోగులు, నేతల కారణంగా చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లంచాలు డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తులు కూడా పలుచోట్ల వస్తున్నాయి.
Published by:Purna Chandra
First published:January 08, 2021, 11:25 IST