ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో క్యాసినో కాంట్రవర్సీ చల్లారడం లేదు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లోని మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహిచారన్న ఆరోపణలతో వారం రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. క్యాసినో జరిగిందని నిరూపిస్తామంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ వెళ్లగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసింది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో టీడీపీ నేతలు తమ దగ్గర రుజువులున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. దీనిపై రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
క్యాసినో కాంట్రవర్సీలో మంత్రి కొడాలి నాని గట్టిగానే టార్గెట్ చేసిన టీడీపీ ఎక్కడా తగ్గడం లేదు. గోవా నుంచి 13 మంది చీర్ గర్ల్స్ ను తీసుకొచ్చి మళ్లీ ఫ్లైట్లోనే పంపించారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఫ్లైట్ నెంబర్లతో సహా వివరిచారు. జనవరి 17వ తేదీ గుడివాడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన చీర్ గర్ల్స్ మధ్యాహ్నం 1గంటకు 6E7072 నెంబర్ గల ఫ్లైట్ లో విజయవాడ నుంచి బెంగళూరు.. అక్కడి నుంచి 6E806 ఫ్లైట్ లో గోవా వెళ్లారని తెలిపారు. ఈనెల 16వ తేదీ నైట్ కాసినో క్లోజ్ అయిందన్న ఆయన.. 17న ఫ్లైట్లో అక్కడికి వెళ్లారన్నారు. చీర్ గర్ల్స్ గుడివాడ ఎందుకొచ్చారో మంత్రి కొడాలి నాని చెప్పాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ నేతల అసత్య ప్రచారంచేస్తున్నారని ఆయన అన్నారు. ఇది గుడివాడపై ప్రేమా లేక కొడాలి నానిపై కక్షా అని ప్రశ్నించారు. సంక్రాంతి మూడు రోజులు వేరని.. 365 రోజులు వేరన్నారు. పేకాట, జూదం, జల్లికట్టు, కోడిపందేలు నిర్వహిస్తారన్నారు. టీడీపీ హయాంలో ఏడాది పొడవునా పేకాట ఆడించారన్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని పేకాట ఆడించలేదా అని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాటక్లబ్బులను, జాదాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. కొడాలి నానిపై కక్ష ఉంటే ఎన్నికల్లో తేల్చుకోవాలిగానీ.. అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, కొడాలి నాని అభాసుపాలు చేయడానికి టీడీపీ కుట్ర చేస్తోందని ప్రజలు అర్ధం చేసుకోవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే తన కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ విసరగా.. తమ దగ్గర సాక్ష్యాలున్నాయని ఇద్దరం చెరో పెట్రోల్ బాటిల్ తీసుకెళ్దామని టీడీపీ నేత బొండా ఉమా ప్రతిసవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, TDP, Ysrcp