విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చాంబర్ వెనుక భాగంలో గోడ కూలింది. పాత కాలపునాటి గోడ కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ఉండడంతో గోడ కూలిందని చెబుతున్నారు. ఇటీవల దసరా నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. అప్పటి వరకు హడావిడిగా ఉన్న ప్రాంతం కొండచరియలు విరిగిపడిన సందర్భంలో అక్కడున్న వారు పరుగులు పెట్టిన దృశ్యాలు కూడా కనిపించాయి. అదే సమయంలో కొండరాళ్ల కింద ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించడానికి పోలీసులు, మరికొందరు వెనక్కు పరిగెట్టిన దృశ్యాలు కూడా ఉన్నాయి. కొండచరియలు పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారని దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తెలిపారు. ఆలయ అధికారి, కానిస్టేబుల్, పారిశుద్ధ్య కార్మికురాలు గాయపడ్డారని స్పష్టం చేశారు. కొండచరియలు పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాబోయే కొంత సేపటి ముందు ఈ దుర్ఘటన జరిగింది. దీంతో అధికారులు కంగారుపడ్డారు. వెంటనే రోడ్డు క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ షెడ్డు ఉండడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో మార్గంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. మొత్తానికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్ అభివృద్ధి, సోలార్ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకటించారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.