Andhra Pradesh: కష్టకాలంలో ఎందరికో సాయపడ్డాడు.. ఇప్పుడతడి కుటుంబం సాయం కోసం ఎదురుచూస్తోంది

ఒకప్పుడు సాయం చేసిన కుటుంబం ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది.

ఆటో డ్రైవర్ అయినా ఎంతో మందికి సాయపడ్డారు. అత్యవసరం అంటే క్షణాల్లో వారి ముందు వాలిపోయేవాడు.. కానీ కరోనా కారణంగా ఇప్పుడు అతడి కుటుంబమే రోడ్డున పడింది. సాయం కోసం ఎదురు చూస్తోంది.

 • Share this:
  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18                                కరోనా కుటుంబాలపై కాటు వేస్తోంది. ఇప్పటికే ఎందరినో అనాథలను చేసింది. ఇంటికి ఆధారమైన పెద్దలను పొట్టను పెట్టుకుంది. తండ్రి మరణించిన చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలలో చిన్నారులు, మహిళలు వీధిన పడ్డారు.. పడుతూనే ఉన్నారు. సునామీలా విరుచుకుపడ్డ సెకెండ్ వేవ్ చాలా కుటుంబాలకు బతుకు భరోసా కోల్పోయేలా చేసింది. విజయనగరం పట్టణంలో ఆటో డ్రైవర్ పరిస్తితి అదే.. పాల్ నగర్ ప్రాంతానికి చెందిన బాణాల మధుసూదన రావు అటో డ్రైవరే అయినా సాయంలో పెద్ద మనసు చాటుకునేవాడు.. కరోనా సమయంలోనూ.. అంతకుముందు కూడా ఎవరికైనా అత్యవసరం అని తెలిస్తే.. పగలు రాత్రి అని తేడా లేకుండా ఉచితంగా వారిని తన ఆటోలో తరలించేవాడు. ఇలా సాయం అనగానే పలికే మధుసూదనరావుని కరోనా కాటేసింది. దీంతో అతడి కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది..

  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని పాల్ న‌గ‌ర్ ప్రాతంలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ మధుసూదన రావుది చిన్న కుటుంబం.భార్య అరుణ పెద్ద‌గా చ‌దువుకోలేదు. తన చిన్నారి వాగ్థేవిని పెద్ద చ‌దువులు చ‌దివించాల‌ని అహర్నిశలు క‌ష్ట‌ప‌డుతుండేవారు. ఆటో న‌డుపుకుంటే వ‌చ్చే డ‌బ్బుల‌తోనే ఇంటి అద్దె, చిన్నారి స్కూల్ ఫీజులతో పాటు ఇంటి బాధ్య‌తల‌న్నీ మ‌ధుసూద‌నరావు చూసుకునేవాడు. ఇంటికి ఏం తెస్తే అది వండిపెట్ట‌డ‌మే అరుణ‌కు తెలుసు.. ఎప్పుడు భర్త లేకుండా గడప బయట కాలు పెట్టలేదు. చిన్న కుటుంబం చింత లేని కుటుంబ‌లా సాగిస్తున్న వారి జీవ‌న ప్ర‌యాణాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి చూడ లేక‌పోయింది. గత నెల మే 29న మ‌ధుసూద‌నరావు కరోనా క‌బలించి ఆ కుటుంబాన్ని అగాదంలోకి నెట్టేసింది.

  ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో అరుణపై నేడు కుటుంబ భారం ప‌డింది. మధుసూదనరావు వైద్యం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో... తన చిన్నారిని ఎలా పెంచాలో తెలియక బ‌రువెక్కిన గుండెతో వేద‌న ప‌డుతోంది. అప్ప‌టికే మూడు నెలలుగా ఇంటెకి అద్దె చెల్లించక ఇంటి యజమాని ఖాళీ చెయ్యమనడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక తన తల్లితో పాటు తన చిన్నారి వాగ్దేవిని చూస్తూ మదనపడుతోంది అరుణ. వరికి ఏ సాయం కావాలన్నా వెంటనే చేసేవాడు. ముఖ్యంగా గర్భిణులకు ఉచితంగా ఆస్పత్రులకు తరలించేవాడు. ఎప్పుడూ సేవా గుణంతో ఉండే మధుసూదనరావుకు కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. కానీ వారిని ఆదుకునే వారు కనిపించడం లేదు. 

  మ‌ధుసూద‌నరావు చిన్ననాటి నుంచి ప్ర‌జా సేవ‌ చేయ‌డంలో ముందుండేవాడు. చిన్న పిల్లవాడిగా ఉండగానే తన తల్లిదండ్రులు కోల్పోవడంతో ఆ కష్టాన్ని చూడలేని మధుసూదన రావు గత కొన్ని ఏళ్లుగా పేదలకు ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఉండే వాడు. ఇలా గత పదేళ్లుగా విజయనగరం పట్టణంలో తాను నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఏ అత్యవసర సమయంలోనైనా ఆస్పత్రులకు వెళ్లేందుకు మహిళలకు గర్భిణీ స్త్రీలకు సహాయపడేవారు. క‌ష్ట‌మెరిగిన వ్య‌క్తిగా అంద‌రిలో త‌ల‌లో నాలుకలా ఉండేవాడు. ప్ర‌స‌వ స‌మ‌యంలో ఓ కాల్ చేస్తే చాలు.. వ‌చ్చి ఇంటి ముందు వాలిపోయేవాడు. అర్ధ‌రాత్రి.. అప‌రాత్రి అన‌కుండా వ‌చ్చి ఆసుప‌త్రిలో చేర్చేవాడు.

  ఈ ఏడాది ఏప్రిల్ 29న తన సోదరుడు జగదీశ్వరరావు కూడా కరోనా బలితీసుకుంది ఆ కష్టం మరిచిపోకముందే సరిగ్గా నెల రోజులకు మే 29న మధుసూదనరావు కూడా కరోనా పాజిటివ్ కారణంగా చనిపోయారు. దీంతో మధుసూదన్ రావు కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పేదలకు సహాయం చేయడం కోసం ఆటో నడుపుకుంటూ ఇతరులకు సహాయ పడుతూ సేవ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇలా ఇప్పుడు మధుసూదనరావు ఆసుపత్రిలో ఉండగా.. వైద్యం కోసం చేసిన 2 లక్షల రూపాయల అప్పు కూడా ఆ కుటుంబానికి భారంగా మారింది. ఇక ఆటో కొనడం కోసం చేసిన అప్పు కూడా ఉంది. ఫైనాన్సర్లకు కొంత చెల్లించాల్సి ఉంది. ఇక ఇక మధుసూదన్ రావు కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి గత మూడు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని కూడా బలవంతం చేస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో ఆ కుటుంబం విలవిలలాడుతోంది.మధుసూదనరావు కుమార్తె వాగ్థేవి తన తండ్రి లేడ‌న్న చేదు నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌ పోతుంది. తండ్రితో ఆటోలో తిరుగుతూ ఆటోలోనే ఆడుకునేది. తాను చ‌దువు కోవాలంటే పుస్త‌కాలు కొని పెట్టే వార‌ని, ఇంటికి ఏం కావాల‌న్నా నాన్నే తెచ్చేవారని తనను ఆటోలో తీసుకు వెళ్లి తనకు కావాల్సినవి కొనిచ్చేవారని వేద‌న‌తో చెబుతుంది చిన్నారి వాగ్దేవి.

  కరోనా సమయంలో మధుసూదనరావు చేసిన సేవలను గుర్తించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు కూడా అందుకున్నాడు. అతడు చేసిన నిస్వార్ధమైన సేవలకు..ఎంతో మంది నుండి ప్ర‌సంశ‌లు కూడా అందుకున్నాడు. పరసేవ కోసమే బతికిన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎవరైనా దాతలు అయినా ఆదుకోవాలని ఆ కుటుంబ ఎదురు చూస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: