(ఆనంద్ మోహన్ పూడిపెద్ది, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18)
విశాఖ ఉక్కు పరిశ్రమ(Vizag steel plant)లో నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మంత్రి గుడివాడ అమర్నాథ్((Gudivada amarnath) పరామర్శించారు. చికిత్స కోసం అవసరమైతే ముంబై తరలించేందుకు స్టీల్ ప్లాంట్ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు అమర్నాథ్. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇద్దరికి 50 నుంచి 65 శాతం వరకు, మిగిలిన వారికి 20 నుంచి 25 శాతం వరకు కాలిన గాయాలయ్యాయని చెప్పారు. వైద్యం విషయంలో కాంట్రాక్టా, శాశ్వత ఉద్యోగులా అనే భేదం లేకుండా చూడాలని ఉక్కు అధికారులకు సూచించారు. అవసరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, వైద్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు అమర్నాథ్. ఎమ్మెల్యే అటు సీఎండీ అతుల్‌భట్, డైరెక్టర్ మొహంతి ఆసుపత్రిలో బాధిత కుటుంబాలకు పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు.
యాజమాన్య నిర్లక్ష్యమే కారణమా?
ఉక్కు పరిశ్రమ ప్రమాద ఘటనతో కార్మికలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ప్రమాదం జరగడం కలకలం రేగింది. ఉక్కు ఎస్‌ఎంఎస్-2 (స్టీల్ మెల్టింగ్ షాపు) విభాగంలో ‘కన్వర్టర్-ఈ’ వద్ద ద్రవ ఉక్కు పాత్ర (స్లాగ్ పాట్) తరలించే ట్రాక్‌పై వ్యర్థాల తెట్టు పడిపోవడంతో అది ముందుకు కదలక ఆగిపోయింది. సాధారణంగా తెట్టు చల్లారిన తరువాత తీస్తారు. అయితే వెంటనే ట్రాక్‌ను సరిదిద్దే పని ఆరంభించే సమయంలో స్లాగ్‌పాట్ పేలి ద్రవ ఉక్కు కార్మికులు, అక్కడున్న పర్యవేక్షణ అధికారులపై పడ్డాయి. ఈ ఘటనలో 10 మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాంత్రీకరణతో సాగాల్సిన పనులు ఉద్యోగులతో చేయిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని కారణంగానే ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని మండిపడుతున్నారు.
వరుస ప్రమాదాలు:
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ద్రవ ఉక్కును నిల్వ చేసే చోటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం కారణంగానే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పటికైనా సరైన ప్రమాణాలు తీసుకుని.. ప్రమాదాలను అరికట్టడమే కాకుండా, సిబ్బంది ప్రాణాలకు మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vizag, Vizag Steel Plant