రాష్ట్ర విభజన తరువాత.. ఏపీలో అప్పుడప్పుడు సీఎం కేసీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఆంధ్రలో సైతం కేసీఆర్ కు భారీగానే అభిమానులు ఉన్నారు. చాలాసార్లు పాలాభిషేకాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తెలంగాణలో ప్రజలకు కానీ, ఉద్యోగులకు కానీ ఏవైనా వరాలు ప్రకటించినప్పుడు.. ఏపీలో ఆయా వర్గాలకు చెందిన వారు పాలాభిషేకాలు చేస్తుంటారు. చాలాసార్లు ఆంధ్రలో కేసీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఇప్పుడు మరోసారి సీఎం కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు విశాఖ ప్రజలు.. ఆయన ఇక్కడకు రావాల్సిందే అని నినదిస్తున్నారు.
ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. దీంతో రాత్రి నుంచే విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. అప్పటి నుంచి ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్ లోని స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నిన్నటి వరకు నిరసనలకే పరిమితమైన కార్మికులు.. ఇప్పుడు రాజకీయంగా ఉద్యమం ముందుకు వెళ్లాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేతలంతా ముందుకు వస్తేనే కేంద్రం తమ నిర్ణయం మార్చుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీలంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాజకీయ నేతల ఇళ్లను నిర్బంధిస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురైంది. కన్నబాబు రాజుకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసన సెగ తాగింది. ఆయన వాహనాన్ని కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో ఆ సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సర్ది చెప్పినంత వరకు కార్మికులు అక్కడ నుంచి కదలలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీఎం జగన్ అఖిలపక్షాల సమావేశం ఏర్పాటు చేయాలని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రమే కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉద్యమంలో కలిసి రావాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ఇద్దరు సీఎంలు గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తేనే.. మోదీ వింటారని.. అందుకే సీఎం కేసీఆర్ కూడా తమ ఉద్యమంలో కలిసి రావాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపించి.. రాష్ట్రాన్ని సాధించుకున్నారో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేసీఆర్ స్ఫూర్తి కావాలి అంటున్నాయి కొన్ని కార్మిక సంఘాలు. మరి ఏపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. కార్మికు డిమాండ్ మేరకైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తారో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, CM KCR, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant, Ycp