విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటనలో బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఇప్పటి వరకు 12 మంది మరణించిన వారి కుటుంబాలకు రూ.12కోట్ల పరిహారం అందజేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించింది. అయితే, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో నివసించే 20వేల మందికి కూడా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అది ఎలా అందిస్తారనేది మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘గ్యాస్ లీక్ వల్ల అస్వస్ధతకు గురైన వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారు. కేజీహెచ్ లో మాత్రం ముగ్గురు పేషంట్లు చికిత్స పొందుతున్నారు. వారు కూడా డిశ్చార్జ్ అవడానికి సిధ్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు అన్నిగ్రామాలలో రెండురోజులలో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తాం. పర్మినెంట్ ఆస్పత్రి కూడా నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆ గ్రామాలలో వారు, ఎవరైనా అస్వస్ధతకు గురైతే మెడికల్ క్యాంపులన్నింటిని కూడా కంటిన్యూ చేస్తాం. రూ.10వేల పరిహారానికి సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తి అయ్యాక పరిహారానికి అర్హులైన వారందరికి డైరక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ స్కీమ్ కింద వారి అకౌంట్లకు జమ అవుతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కడంతో లబ్ధిదారులకు చేరుతుంది.’ అని ప్రకటించారు.
ఈ సంఘటనలో బాధితులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 12 మందికి 12 కోట్ల రూపాయలు అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందినవారికి రూ.5,14,75,000 అందించారు. రూ. 10వేల చొప్పున మరో రూ.20 కోట్లు అంతా కలిపి దాదాపు రూ. 38 కోట్ల రూపాయలు అవుతుంది. పుట్టిన బిడ్డ దగ్గర్నుంచి వృధ్దులవరకు ప్రతిఒక్కరికీ రూ.10వేల సాయం అందుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. డాక్టర్లు సూచించిన విధంగా నాలుగు నుంచి ఎనిమిది వారాలపాటు అవసరమైనవారికి టెస్టులు చేస్తారని చెప్పారు. ఆ తర్వాత కూడా ప్రతి నెలా టెస్టులు చేస్తారన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.