Vizag gas tragedy| విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం జరగనుంది. ప్రస్తుతం 10 మంది మృతదేహాలు కేజీహెచ్ మార్చురీలో ఉన్నాయని.. వాటికి రేపు ఉదయం పోస్టుమార్టం నిర్వహిస్తామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ఈ గ్యాస్ లికేజ్ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించగా.. మరో 316 అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 193 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుడగా.. మరో 66 మంది విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెందుర్తి, గోపాలపట్నం ఆస్పత్రుల్లో 57 మందికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై... 11 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ సహా పలు రాష్ట్రాల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.