• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPTAM LG POLI GAS LEAKAGE TRAGEDY COMPLETE ONE YEAR STILL TENSION SITUATION IN NEAR VILLAGES NGS VZM

LG Polymers: ఏడాది పూర్తైనా వీడని స్టైరిన్ గ్యాస్ విషాదం.. ఇంకా అందని పరిహారం

LG Polymers: ఏడాది పూర్తైనా వీడని స్టైరిన్ గ్యాస్ విషాదం.. ఇంకా అందని పరిహారం

విశాఖ విషాద ఘటనకు ఏడాది

విశాఖలో విషాద ఘటనకు ఏడాది పూర్తైంది. ఇంకా ఆ ప్రాంతాన్ని మాత్రం భయం వీడ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ప్రాణాలు అరచేత పెట్టుకొనే ఉంటున్నారు. అంతలా భయపెట్టింది నాటి ఘటన. ఏడాది పూర్తైనా ప్రభుత్వం ఇస్తామన్న నష్ట పరిహారం అందలేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    ఒకరు ఇద్దరు కాదు 15 మంది మృత్యువాత పడ్డారు. అది కూడా ఏం జరుగుతోందో తెలియక కళ్లు తిరిగి రోడ్డుపైనే పడిపోయిన వారందెరో. ఆ ఘనట ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. విశాఖలో పెను విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్‌ ఘటనకు ఏడాది పూర్తయింది. గత ఏడాది విశాఖలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 15 మంది మృతి చెందారు. అంతా విషవాయువు ధాటికి ఊపిరి అందక రోడ్లపైనే కుప్పకూలిపోయారు. కళ్లెదుటే తమ వారిని కోల్పోయిన బంధువులు.. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, స్థానికులు, బాధితులలో ఇంకా భయం కనిపిస్తూనే ఉంది. అడవివరం, వేపగుంట, పెందుర్తి, చిన ముషిడివాడ, సుజాతనగర్ ప్రాంత వాసులు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు.

    సరిగ్గా అదే సమయంలో కరోనా వైరస్ మొదటి దశ విజృంభించింది. దీంతో మరింత భయభ్రాంతులకు గురయ్యారు విశాఖ ప్రజలు. అయిత స్టైరిన్ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. దీంతో సీఎం జగన్ మంచి పెద్దమనసుతో సాయం చేశారని అంతా ఆశించారు. కానీ తమకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరికి అందినా.. మరి కొందరికి పరిహరం అందలేదని అంటున్నారు.

    మృతి చెందిన వారిని పక్కన పెడితే.. ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలతో ఇంకా చాలామంది బాధితులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వివిధ గ్రామాల్లో పర్యటించిన మంత్రులు, అధికారులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఆస్పత్రి మాటే లేదని ఆరోపిస్తున్నారు. గతంలో పాలిమర్స్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో రెండు వేల ఎకరాల వరకు సాగయ్యేది. ఈ ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీ రంగు మారిన నీళ్ళు పంట భూముల్లోకి పారడంతో పంటలు సరిగ్గా పండటం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఒక వేళ పండినా పంటలో నాణ్యత ఉండటం లేదంటున్నారు. రంగు మారిన నీళ్లు పశువులు సైతం తాగి మృత్యువాత పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించిన నీరబ్‌ కుమార్‌ కమిటీ నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి.. లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి అంటూ నివేదిక సమర్పించింది. స్థానికులు మాత్రం అక్కడ నుంచి కంపెనీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని అంటున్నారు.

    ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తులు, యంత్రాలను విక్రయించాలని, ఆ ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ దగ్గర జమ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్‌ .. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మృతులు, బాధితుల కుటుంబాలకు 37.10 కోట్ల పరిహారం చెల్లించామని, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఆదేశాల ప్రకారం 50 కోట్లు డిపాజిట్ చేశామని ఎల్జీ పాలిమర్స్‌ తెలిపింది. ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులు, ముడి సరకు అమ్మగా వచ్చిన సొమ్మును కలెక్టర్‌ వద్ద జమ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు పాలిమర్స్ తరపు న్యాయవాదులు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థలకు తమ వాదనలు తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. 

    జరిగిన ఘటన తీవ్రతా ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏడాది అవుతున్నా.. విషాద ఘటన తమ కళ్ల ముందే ఇంకా కదలాడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురంతో పాటు నందమూరి నగర్‌, వెంకటాద్రి గార్డెన్స్‌, జనతా కాలనీ, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం కాలనీ ప్రజలు ఏడాది కిందటి ప్రమాదాన్ని గుర్తు చేసుకుని భయాందోళనకు గురవుతున్నారు. విషవాయువు లీకై గ్రామానికి చెందిన 12 మంది ప్రమాదం జరిగిన రోజున మృతిచెందగా, మరో ముగ్గురు మరికొన్ని రోజుల తర్వాత మృతి చెందారు. స్టైరిన్‌ పీల్చిన కారణంగా గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇంకా కంపెనీ మూతపడడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో పలువురు రోడ్డునపడ్డారు. ఒకప్పుడు గ్రామంలో స్థలాలు, పొలాలు, ఇళ్ల్లు కొనుగోలు కోసం తిరిగినవారు నేడు ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. అప్పటి నుంచి తమ బతుకుల రోడ్డున పడినట్లు అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు.

    ఇటు ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం  నష్ట పరిహారం చెల్లించింది. దీంతో పాటు ప్రమాదం కారణంగా ఇబ్బందులు పడిన చాలా మంది వరకు 10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే ప్రమాదం జరిగిన రోజు మృతిచెందిన 12 మందికి కోటి చొప్పున పరిహారం అందినా, ఆ తరువాత కొద్దిరోజులకు చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు మాత్రం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 150 మందికి నేటికీ ప్రభుత్వం అందజేస్తామన్న రూ.10 వేల పరిహారం అందలేదని, అప్పటి నుంచి తమ ఆరోగ్యం బాగా ఉండటం లేదని, ఆనారోగ్యాలు వెంటాడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు