ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) వైఎస్ఆర్సీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు (MLA RK Roja) ప్రత్యేక స్థానముంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలోకి వచ్చినా అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది. వైసీపీ తరపున బలంగా వాయిస్ వినిపించగల నేతల్లో ఆమె ముందువరుసలో ఉంటారు. దీంతో ఆమెకు మంత్రి పదవి గ్యారెంటీ అనే ప్రచారం గతంలో బాగానే జరిగింది. కానీ సామాజికవర్గ సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావడం, మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్నందున కేబినెట్ బెర్త్ కోసం ఆమె గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే తన మనసులో మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుంచిన ఆమె తన ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులుంటాయన్న సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా ప్రముఖ జ్యోతిష్యురాలిని కలిశారు.
మంత్రి పదవి కోసమేనా..?
విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలసలోని దేముడమ్మ అనే జ్యోతిష్యురాలిని బుధవారం రోజా కలిశారు. మంగళవారం సీఎం జగన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. ఆ తర్వాతి రోజే నేరుగా విజయనగరం వెళ్లారు. తన రాజకీయ భవిష్యత్ గురించి తెలుసుకునేందుకే దేముడమ్మను కలిసినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవీ యోగం ఉందా..? లేదా..? వస్తుందా..? రాదా..? అనే సందేహాలను నివృత్తి చేసుకునేందుకే ఎమ్మెల్యే రోజా.. దేముడమ్మను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె పర్యటనపై స్థానిక వైసీపీ నేతలకు కూడా సమాచారం లేనట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో చర్చ
ఐతే రోజా జాతకం ఎలా ఉంది..? ఆమెకు దేముడమ్మ ఏం చెప్పింది. మంత్రి పదవి దక్కాలంటే ఏమైనా శాంతిపూజలు చేయాలని సూచించారా..? లేక అడ్డుపడుతున్న శక్తుల గురించి వివరించారా..? అనేదానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో దేముడమ్మ పలువురు ప్రముఖులకు జాతకాలు చెప్పారు. వీరిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పలువురు ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జాతకాలు చూసినట్లు తెలుస్తోంది.
మంత్రి పదవి కోసం ప్రయత్నాలు..
మంత్రివర్గంలో చోటు కోసం రోజా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఐతే పార్టీలోని సీనియర్ నేతలు, ఆమె సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతలు రోజాకు పదవిరాకుండా అడ్డుపడుతున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె జాతకం చూయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
స్థానిక ఎన్నికల్లో గెలుపుకు కృషి
ఇటీవల సీఎం వైఎస్ జగన్ తిరుపతి వచ్చినప్పుడు కూడా ఆయన చిత్రంతో కూడిన శాలువాతో సత్కరించి సీఎం దృష్టిని ఆకర్షించారు రోజా. అలాగే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కొవిడ్ సమయంలో సహాయక కార్యక్రమాలు చేపట్టి పార్టీ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. ఐతే ఇటీవల నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర ఎంపీపీ విషయంలో పార్టీ నేతలతో విభేదించడంతో పంచాయతీ అధిష్టానం వరకు వెళ్లింది. ఆ వ్యవహారంలో ఆమె వైరి వర్గంపై రోజా పైచేయి సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, MLA Roja, Ysrcp