VISAKHAPATNAM YSRCP LEADER MALLA VIJAYA PRASADE ARRESTER BY ODISHA POLICE IN CHIT FUNDS CASE FULL DETAILS HERE PRN VSP
YSRCP Leader Arrested: వైసీపీలో కలకలం.. చీటింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మళ్ల విజయ్‌ప్రసాద్ (Malla Vijaya Prasad) అరెస్టు ఉదంతం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మళ్ల విజయ్‌ప్రసాద్ అరెస్టు ఉదంతం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో ఉంటూ ఇటీవలే ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ (ఏపీ ఈడబ్ల్యూఐడీ) కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన మళ్లను చిట్‌ఫండ్ పేరిట మోసం కేసులో ఒడిశా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లడం పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. ‘వెల్ఫేర్’పై రాష్ట్రంలో కూడా కొంతకాలంగా ఆరోపణలు ఉన్నప్పటికీ...సంబంధిత సంస్థ యజమాని అధికార పార్టీలో వుండడంతో కేసులు నమోదుకాలేదనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.‘వెల్ఫేర్’ పేరుతో విశాఖ కేంద్రంగా రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించిన మళ్ల విజయ్‌ప్రసాద్ ఏపీతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విస్తరించారు.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మళ్ల విజయప్రసాద్ బ్రాంచీలు ప్రారంభించారు. కొంతకాలంపాటు ఖాతాదారులకు బాగానే చెల్లింపులు జరిపినప్పటికీ ఆ తర్వాత ఇబ్బందులు మొదలైనట్టు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో గడువు దాటినా చెల్లింపులు జరపకపోవడమేమిటంటూ డిపాజిట్‌దారులు సంస్థ కార్యాలయాలకు వచ్చి గొడవలకు దిగుతున్నారు. నగరంలోని ఆశీల్‌మెట్ట కూడలిలో వున్న సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికార పార్టీ నేతకు చెందిన సంస్థ కావడంతో కేసులు నమోదుచేయకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నట్టు ప్రచారం ఉంది.
ఇదిలా ఉంటే ఒడిశాలో కూడా డిపాజిట్లు, చిట్స్ కాలపరిమితి దాటిపోయినప్పటికీ తిరిగి చెల్లింపులు జరపకపోవడంతో కొంతమంది అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదు కావడంతో సీఐడీకి బదిలీ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఒడిశా సీఐడీ పోలీసులు 2019 జూలై 17న క్రైమ్ నంబర్ 12 కింద కేసు నమోదుచేశారు. అందులో సెక్షన్ 420,406,467,468,471,120-బి రెడ్‌విత్ 4,5,6 ఐపీసీతోపాటు ఒడిశా డిపాజిటర్స్ రక్షణ చట్టం-2011 కింద కేసులు నమోదుచేశారు. కేసు దర్యాప్తు పూర్తవడంతో సంస్థ ఎండీ మళ్ల విజయ్‌ప్రసాద్‌ను నిందితుడిగా గుర్తించి సోమవారం నగరానికి వచ్చి అరెస్టు చేశారు.
కొంతమంది నేతలు ఈ విషయాన్ని పార్టీలోని ముఖ్య నాయకుల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇటీవలే చైర్మన్‌గా నియమితులైన నేత, ఒక నియోజక వర్గానికి సమన్వయకర్తగా పనిచేస్తున్న నేత పరిస్థితితే ఇలాగైతే.., రేపు ఏదైనా వస్తే తమ పరిస్థితి ఏమిటోనని కొంతమంది చర్చించుకోవడం గమనార్హం. మళ్లను ఒడిశా పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో నగరంలో కూడా పోలీసులకు ఫిర్యాదులు అందినా ఆశ్చర్యపోనక్కర్లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజా ఉదంతం మళ్ల రాజకీయ భవిష్యత్తుతో పాటు వైసీపీపై కూడా ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.