Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
విశాఖపట్నానికి (Visakhapatnam) వైసీపీ (YSRCP) నేతలు అచ్చిరారో.. వైసీపీ నేతలు విశాఖకు అచ్చిరారో తెలియడం లేదు. ఎప్పుడు విశాఖ నగరంలోని నాలుగు దిక్కులా టీడీపీ (TDP) యే చక్రం తిప్పుతోంది. మొన్నటి 2019 వైసీపీ ప్రభంజనంలో కూడా ఫ్యాన్ గాలి అంతా వీచింది. కానీ.. విశాఖలోని నాలుగు దిక్కులా.. అంటే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాలు మాత్రం టీడీపీ నేతల్నే ఎన్నుకున్నాయి. అంటే అంతటి ప్రచండ గాలిలో కూడా టీడీపీ ఇక్కడ నిలకడగా ఉందనే అర్ధం. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు 175 కి 175 అంటున్న వైసీపీకి ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా కావాల్సిందే. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీనికి పెద్ద ఉదాహరణ విశాఖ పశ్చిమ నియోజకవర్గం.
ఇక్కడి వైసీపీ నేతల విభేదాలు తారస్థాయికి చేరాయి. సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మధ్య అసలు పొసగడం లేదని తెలుస్తోంది. ఇటీవల 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్, 89వ వార్డు పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌లను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. వారిద్దరిపై సస్పెన్షన్ ఎత్తి వేయించేందుకు ఇప్పుడు మళ్ల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో మళ్ల విజయప్రసాద్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత మూడేళ్లపాటు ఆయనే సమన్వయకర్తగా పనిచేశారు.
అయితే మళ్ల విజయప్రసాద్ వ్యాపారాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కేసుల నమోదు, అరెస్టు నేపథ్యంలో సమన్వయకర్త బాధ్యతల నుంచి మళ్ల విజయప్రసాద్‌ను తప్పించి, ఆ స్థానంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించాలని వైసీపీ అధిష్ఠానం భావించింది. అయితే అందుకు మళ్ల విజయప్రసాద్‌తో పాటు పలు కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. తన కుటుంబంలో ఎవరికైనా సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వాలని మళ్ల కోరగా, అధిష్ఠానం అంగీకరించలేదు.
దీంతో విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్‌ను సమన్వయకర్తగా నియమించింది. ఆరంభంలో కొన్నాళ్లు ఆడారి, మళ్ల సమన్వయంతో పనిచేశారు. ఆ తరువాత ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయన్నది బహిరంగ రహస్యం. నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు ఆడారి ఆనంద్‌కు సహకరించడం లేదనే ప్రచారం పార్టీలో ఉంది. వారంతా మళ్ల విజయ్‌ప్రసాద్ అండదండలు చూసుకునేలా అలా ప్రవర్తిస్తున్నారనే భావన కూడా ఆనంద్ వర్గీయుల్లో ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తన మాటను పట్టించుకోవడం లేదంటూ ఆడారి ఆనంద్‌కుమార్ ఇటీవల పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.
నిత్యం వివాదాల్లో.. దూకుడుదనంతో కేసుల్లో ఇరుక్కునే ఇద్దరు కార్పొరేటర్లు విశాఖలో ఉన్నారు. 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్, 89వ వార్డు పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ లే వారిద్దరు. అయితే వీరిని పార్టీ నుంచి వైవీ సుబ్బారెడ్డి సస్పెండ్ చేసినట్టు పేర్కొంటున్నారు. అయితే సస్పెండ్ చేసి వారం రోజులు కూడా కాకముందే వారిద్దరినీ వెంటబెట్టుకుని మళ్ల విజయప్రసాద్ సర్క్యూట్‌హౌస్‌లో వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. వారిద్దరిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేసుల్లో ఉన్నవారిని కాపాడుకుందామని తపించే ప్రయత్నం మళ్ల విజయప్రసాద్ మానుకోవాలన్నది అధిష్టానం అభిప్రాయం. అయితే మళ్ల పై అభియోగాలు మోపుతున్న ఆడారి ఆనంద్ కి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అంతగా పేరు లేదు. ఆడారి ఆనంద్ లా వలస పక్షుల్ని కూడా పశ్చిమం నమ్మే పరిస్థితి లేదు. టీడీపీకి గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా వైసీపీకి వచ్చి ఏం చేస్తారన్నది పెద్ద ప్రశ్న. తులసీరావు వంటి ఉత్తమ ఛైర్మన్ నడిచిన సంస్థను ఆయన డైరక్టర్ల సహాయంతో వారసత్వ సంపదగా లాక్కున్నారన్న విమర్శ ఉండనే ఉంది. ఇటు విశాఖ డెయిరీ ఛైర్మన్ గా.. డబ్బులు బాగా ఖర్చు చేస్తారన్న ధీమా తప్ప.. ఆడారి ఆనంద్ కు పెద్దగా పేరు కూడా ఏం లేదు.
మొత్తం మీద అధిష్టానం నిర్ణయాలు ఏవైనా.. వలస నేతలు పశ్చిమం కోసం కొట్టుకుంటున్నారన్ననది నిర్వవివాదంశం. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నేత గణబాబు పాతుకు పోయారన్నది వాస్తవం. తర్వాతి ఎన్నికలో కూడా ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నది తెలిసిందే. మరి వైసీపీ అధినేతతో పాటు.. ప్రాంతీయ ఇన్ఛార్జి నేతలు ఈ సారి కూడా పప్పులో కాలేసినట్టేనని ఇప్పటికే నియోకవర్గంలో టాక్ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradeh, Local News, Visakhapatnam, Ysrcp