Vijayasai Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ పాత్ర ఉంది అంటూ.. విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)ని తాజాగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కలవడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. శరత్ చంద్రారెడ్డి చెవిలో ‘ఏమీ చెప్పొద్దు’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పి ఉంటారా అంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శల వేడి చెల్లారకముందే మరో అంశం విపక్షాలకు అస్త్రంలా దొరికింది..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నాలజీ ఆధారంగా విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు.
విజయసాయిరెడ్డి వాడుతున్నది లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ అని సమాచారం.. ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ మిస్ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకతాయిలు ఎవరైనా తీశారా.. దొంగలు చొరబడ్డారా..? లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కాంతారాను దింపేసిన తహసీల్దార్.. అద్భుత నృత్యానికి అధికారులు ఫిదా.. వీడియో చూడండి
అయితే విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదని.. కావాలనే ఆయన ఫోన్ మిస్ అయినట్లు నటిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని పోలీసులు విచారిస్తున్న సమయంలో ఇలా జరగడం వెనుక పెద్ద కథే ఉందని వివరిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.
ఏ 2 ఫోన్ పోలేదు... పడేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి.
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) November 23, 2022
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలెస్ పూసాలు కదులుతున్నాయని.. అందుకే విజయసాయిరెడ్డి తన ఫోన్ పడేసుకున్నారని ఆరోపించారు. సినిమా లాని కొన్ని సీన్లను ఫాలో అయ్యి.. ఇలా దొంగ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను దాచుకుని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునే ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ayyannapatrudu, Delhi liquor Scam, Vijayasai reddy