(DURGA ANAND MOHAN RAO PUDIPEDDI, NEWS 18, Visakhapatnam)
WPL Auction 2023 : తండ్రి కల ఆమెకు ఆశయం అయ్యింది. తాను చేయలేని పని తన బిడ్డ చేయాలని భావించారు ఆ తండ్రి. అందుకే సమస్యలు ఉన్నా.. బాల్ పట్టింది. కష్టపడి ఆడింది. రక్తహీనత ఇబ్బంది పెట్టినా.. చెమటోడ్చి నేషనల్ స్థాయికి వెళ్లింది. ఇష్టపడి బౌలింగ్ చేసింది. బ్యాటింగ్ లో కూడా నేనున్నాని ప్రతిభ చూపింది. ఫీల్డింగ్ లో తానేంటో నిరూపించింది. ఆల్ రౌండర్ ప్రతిభతో అందర్నీ అబ్బురపరిచింది. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మెరిసింది. మన విశాఖకి చెందిన షబ్నం షకీల్. సోమవారం జరిగిన వేలంలో షబ్నం షకీల్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవలె జరిగిన అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాలో షబ్నం భాగంగా ఉంది. తాజాగా వేలంలో ఆమెను గుజరాత్ కొనుగోలు చేయడంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికైన అతి పిన్న వయస్కురాలిగా షబ్నం నిలిచింది. షబ్నం వయసు 15 ఏళ్లు మాత్రమే.
8 ఏళ్లకే..
ఎం. షబ్నం. ఎనిమిదేళ్లకే గ్రౌండ్ వైపు వెళ్లింది. తల్లిదండ్రులు మహ్మద్ షకీల్, తల్లి ఈశ్వరమ్మ. తల్లిదండ్రులు ఇద్దరూ నావికాదళంలో ఉద్యోగులు. డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నారు. సోదరి షాజహాన్ బేగం. ఆమె కూడా అండర్ 15 క్రికెటరే. ఇక షబ్నం చిన్నప్పుడే క్రికెట్ వైపు వచ్చింది. మొదట తనకు హిమోగ్లోబిన్ సమస్యతో ఉండటంతో ఏదైనా క్రీడవైపు వెళ్లాలని వైద్యుల సూచన. తన కుమార్తెను పదేళ్ల వయసు తర్వాత క్రికెట్ లోకి అడుగు పెట్టిద్దామని షబ్నం తండ్రి షకీల్ కోరిక. అయితే ఈ సమస్య రావడంతో వెంటనే క్రికెట్ ఆడించడం మొదలుపెట్టారు. ఎన్ఏడీ, నావల్ గ్రౌండ్స్ లో ప్రాక్టీసు మొదలైంది.
తన తండ్రే తనకు మొదటి గురువని అంటుంది షబ్నం. ఆమెకు బౌలింగ్ వేయడం నేర్పించింది.. అటు వైపు తర్ఫీదు ఇచ్చింది ఆయనే అంటుంది. షకీల్ కూడా మొదట్లో క్రికెట్ బాగా ఆడేవారు. నేవీ యూనిట్ క్లబ్ మ్యాచ్ లలో కెప్టెన్సీ కూడా నిర్వహించారు. అనేక మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించారు. కానీ.. నేషనల్ కి ఎదగాలనే ఆయన కోరిక మాత్రం ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా నెరవేరలేదు. అందుకే ఆయన ఉద్యోగం వైపు మనసు మళ్లించారు. అయితే తన కుమార్తెలు ఇద్దరిలో ఒకరు క్రికెటర్ అవ్వాలని.. దేశానికి ఆడాలన్ని ఆయన ఆకాంక్ష. ఆ కలను మొదటి కుమార్తె మొన్నటి గర్ల్స్ వరల్డ్ కప్ లో నెరవేర్చేసింది.
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌత్ ఆఫ్రికాతో, శ్రీలంకతో ఇండియా తరఫున ఆడి వికెట్లను తీసింది. ఇందులో తన సత్తా చూపించింది. తాను అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్రాల జట్లలో ఆంధ్ర తరఫున ఆడి సాధించిన విజయాల అనుభవం ఇక్కడ పనికివచ్చిందని అంటోంది షబ్నం. అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టుకు ఎంపికై తన తండ్రి కలను నెరవేర్చింది. ఎందుకంటే.. తనకు పుట్టేది ఎవరైనా సరే వారిని క్రికెటర్‌గా చూడాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఆయన తపన బ్యాట్, బాల్‌తో ఇప్పుడు అలవోక ఆయన కుమార్తె ప్రతిభ చూపిస్తోంది. కూతురికి క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఎన్నో చేశాడు షకీల్. కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టినా.. ముందుకెళ్లాడు. ఫలితంగా క్రికెట్ అకాడమీలో పెద్ద క్రికెటర్ కావాలన్న కలను షబ్నం నెరవేర్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ కారణంగా 19 ఏళ్లకే నేషనల్స్ ఆడే అవకాశం దక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Mumbai, Team India, Visakhapatnam, Vizag, WPL 2023