పెళ్లి వంటి పవిత్ర బంధాన్ని అపహాస్యం చేస్తూ.. అనవసర సుఖాల వెంటపడుతున్నవారి సంఖ్య ఈ రోజుల్లో పెరిగిపోతోంది. ఎంతో సాఫిగా సాగుతున్న బంధాలు.. అక్రమ సంబంధాల కారణంగా విచ్ఛిన్నమవతున్నాయి. పరాయి వాళ్ల మోజులో కట్టుకున్నవాళ్లనే కడతేర్చడానికి వెనుకాడని వారు కూడా ఉన్నారు. ప్రియుడితో తన సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హతమార్చిందో ప్రబుద్ధురాలు. అంతేకాదు ఇందులో తన కొడుకుని కూడా భాగం చేసింది. అక్కడితో ఆగలేదు హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన సింగంపల్లి రాముకు భార్య తులసి, ఇద్దరు పిల్లలున్నారు. ఈనెల 12న ఉదయం కొటారుబిల్లి వద్ద జరిగిన ప్రమాదంలో రాము చనిపోయాడంటూ చూసిన వారు అతడి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పారు.
దీంతో అక్కడికెళ్లిన కుటుంబ సభ్యులు.. రాము వెళ్లిన బైక్ ఒక చోట.. అతడి మృతదేహం మరోచోట ఉండటం గమనించారు. తలపై బలమైన గాయాలుండటంతో ఇది రోడ్డు ప్రమాదం కాదని.. హత్య అని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నికోణాల్లో విచారించగా హత్య విషయం బయటపడింది. ఐతే హత్యకు ఆమె వేసిన స్కెచ్ విని పోలీసులు షాక్ తిన్నారు.
రాముకు తులసీతో పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో తులసీ.. సన్యాసినాయుడు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న రాము.. పద్ధతి మార్చుకోమని పలుసార్లు హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని తులసీ స్కెచ్ వేసింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పి మర్డర్ ప్లాన్ వేశారు. అంతేకాదు రాము కొడుక్కి.. తండ్రిపై లేనిపోని మాటలు చెప్పింది. దీంతో అతడు కూడా తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు.
తల్లిచెప్పిన మాట విన్న బాలుడు తనకు కడుపు నొప్పిగా ఉందని నాటకమాడాడు. దీంతో రాము.. కొడుకును తీసుకొని విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తిరిగొచ్చే సమయంలో బహిర్భూమికి వెళ్లాలంటూ తల్లి చెప్పిన చోటే బైక్ ఆపించాడు. అదే సమయంలో ప్రియుడితో కలిసి కాపుగాసిన తులసి భర్తపై దాడి చేసి హత్య చేసింది. అనంతరం దానిని హత్యగా చిత్రీకరించేందుకు శవాన్ని రోడ్డుపై పడేసేందుకు యత్నించారు. ఐతే అటువైపు కొన్ని వాహనాలు రావడంతో శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. పోలీసుల దర్యాప్తులో హత్య చేసిన విషయం బయటపడటంతో తులసితో పాటు ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.