గ్లోబల్ వార్మింగ్. ప్రపంచాన్ని వణికిస్తున్న పదం. పెరిగిపోతున్న కాలుష్యం వల్ల సహజ వనరులు దెబ్బతిని మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతోంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులపై అమెరికా అంతరిక్ష సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించింది. వచ్చే 80 ఏళ్లలో భారత్ లో 12 నగరాలు నీటమునగడం ఖాయమని వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరగడం వల్ల తీరప్రాంతాల్లోని ప్రజలకు ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA)నివేదిక ప్రకారం, ఓఖా, మోర్ముగావ్, భావ్నగర్, ముంబై, మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, టుటికోరన్, కొచ్చి, పారాదీప్ మరియు కిడ్రోపోర్ తీర ప్రాంతాలపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు భవిష్యత్తులో సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుందని నాసా పేర్కొంది.
వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) నివేదికను ఉదహరిస్తూ, NASA సముద్రంలో అనేక నగరాలు మునిగిపోతాయని హెచ్చరించింది. విశాఖతో పాటు ముంబై, చెన్నై లాంటి నగరాలు ఈ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది. 2100 నాటికి విశాఖనగరం మూడు అడుగుల నీటిలో మునుగుతుందని నాసా నివేదికలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న విశాఖనగరం ఇప్పుడు ప్రమాదంలో ఉందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. బంగాళాఖాతానికి అనుకొని ఉన్న విశాఖ నగరం తరచూ ప్రకృతి విపత్తుల తాకిడిని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వందలాది తుఫాన్లను తట్టుకున్న ఘనత విశాఖది. హుద్ హుద్ ధాటికి రూపురేఖలు కోల్పోయినా తట్టుకున్న విశాఖనగరం మునిగిపోయే ప్రమాదమున్న నగరాల జాబితాలో చేరడం గమనార్హం.
తూర్పు నావికా దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం మొత్తం 681 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 17 లక్షల మందికి పైగా జనాబా కలిగి ఉంది. భారత్ లోని అత్యంత సుందరమైన నగరాల జాబితాలో విశాఖ ముందుంటుంది. అలాంటి విశాఖపట్నం కేవలం 80 ఏళ్లలో నీటమునగనుందన్న వార్త గుబులు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధిలో విశాఖకు కీలకస్థానముంది. ఫిషింగ్ హార్బర్, పోర్టుతో పాటు స్టీల్ ప్లాంట్, ఫార్మా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ విశాఖ ఉంది.
విశాఖ లాంటి అందమైన నగరాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు సహజ వనరులను కాపాడాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు భూ తాపాన్ని పెంచే ప్లాస్టిక్, రసాయనాల వంటి వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.