P. Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant). విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రాణాలొడ్డి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమం బుధవారంతో 300 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా బుధవారం భారీ ఎత్తున ధర్నా చేసేందుకు కార్మిక వర్గాలు సమాయత్తమయ్యాయి. గాజువాకలో ఏర్పాట్లు చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ (ఎకనామిక్ ఎఫైర్స్) ప్రకటించింది. ఆ రోజు నుంచే ఉక్కు కార్మికులు, భూములిచ్చిన నిర్వాసితులు ఉద్యమ బాటపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్మాగారం ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
అన్ని రాజకీయ పక్షాల మద్దతూ కూడగట్టారు. ప్లాంట్ పరిపాలనా భవనం ముట్టడించారు. ప్లాంట్ గేట్లను దిగ్బంధం చేశారు. అంతా కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా ధర్నాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వచ్చి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఇక్కడ కార్మికులు పోరాటం చేస్తుంటే.. అక్కడ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పుండు మీద కారం చల్లినట్లుగా ప్రకటనలు చేస్తోంది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ముందుకువెళుతున్నామని చాలా విస్పష్టంగా చెబుతోంది.
ఈ క్రమంలో ప్లాంట్ అమ్మకంలో భాగంగా ట్రాన్సాక్షన్, లీగల్ సలహాదారుల నియామకాల కోసం నోటిషికేషన్ ఇచ్చింది. దీంతో ఉక్కు ఉద్యమం మరింత ఊపందుకుంది. ఇదే సమయంలో కోక్ ఓవెన్ బ్యాటరీల ప్రైవేటీకరణకు యాజమాన్యం టెండర్లు పిలవడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు అనుమతించేది లేదని చెబుతున్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ దాదాపు పది నెలలుగా సాగుతున్న ఉద్యమానికి మహిళా సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటించింది. వేదిక ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్‌లో మహిళలు భారీ మానవహారం నిర్వహించి, ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయకపోయినా.. ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను అమ్మేయడానికి ప్రధాని మోదీ యత్నించడం దారుణమని.. ప్రజలంతా ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి, తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల, వైసీపీ మహిళా విభాగం నాయకురాలు పి.ఉమారాణి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు సునందాదేవి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.