Setti Jagadeesh, News 18, Visakhaptnam
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు (Cyber Crimes) భారీగా పెరిగిపోతున్నాయి. వివిధ రూపాల్లో దుర్మార్గపు ఆలోచనలతో అమాయక ప్రజలను బోల్తా కొట్టించి వారి వద్ద నుంచి భారీగా సొమ్మును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తప్పుడు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసులు చెబుతున్నా.., కొంత మంది ప్రజలు మాత్రం మాయగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు. ప్రస్తుతం అంతా డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా అంతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరస్తులు రోజుకో మార్గంలో డబ్బులు కాజేయడానికి ఆన్‌లైన్ మోసాలకు ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) లో ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ (Online Shopping Website) నిర్వాహకులమని వినియోగదారులకు ఫోన్‌లు చేసి లక్కీడ్రా వచ్చిందని నమ్మించి మోసానికి పాల్పడుతున్న దొంగల ముఠాను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., విశాఖ నగరానికి చెందిన ఓ మహిళకు గత నెల 11న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీషో నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకొని లక్కీడ్రాలో మీకు కారు వచ్చిందని చెప్పారు. కారు కావాలా? లేక కారుకు తగిన డబ్బులు కావాలా అని అడిగాడు. తాను షాపింగ్ చేసిన వివరాలు పూర్తిగా చెప్పటంతో నిజమని ఆ మహిళ నమ్మింది. ఈ నగదు రావాలి అంటే మొదటగా డబ్బులు డిపాజిట్ చేయటానికి ఖాతాను తెరవాల్సి ఉందని చెప్పారు.
దీంతో బాధిత మహిళ రూ.4150 తమ ఫోన్ ద్వారా పంపించారు. తర్వాత కొత్త ఖాతా తెరిచినందున లావాదేవీలు ఎక్కువగా ఉండాలని వాళ్లు చెప్పారు. దీంతో మహిళ తన ఖాతా నుంచి మొత్తం రూ.4,18,820 నగదును వాళ్లకు పంపించారు.. తర్వాత కూడా డబ్బులు వేయాలని కోరగా, ఆమెకు అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగ ప్రవేశం చేసిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఆ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఎం. సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారమంతా ఎవరు నడిపిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేయగా బిహార్‌కి చెందిన రంజాన్ అనే వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఢిల్లీలో చిన్న గదిని అద్దెకు తీసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతూ కొంతమంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు. దీని వెనుక ఉన్న ప్రధాన నిందితుడు రంజాన్ కోసం గాలిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam